Shashi Tharoor: బిల్‌గేట్స్‌.. నారాయణమూర్తి రాజీకొస్తే: ‘పని గంటల’పై శశిథరూర్‌ ఆసక్తికర కామెంట్స్‌

Shashi Tharoor: వారానికి ఎన్ని గంటలు పనిచేయాలన్నదానిపై బిల్‌గేట్స్‌, నారాయణమూర్తి కలిసి కూర్చుని రాజీకి రావాలని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ అన్నారు. పనిగంటలపై వీరిద్దరూ వెల్లడించిన అభిప్రాయాలపై థరూర్‌ ఈ విధంగా స్పందించారు.

Published : 27 Nov 2023 13:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగుల ‘పని గంటల (Working Hours)’పై గత కొంతకాలంగా నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై టెక్‌ దిగ్గజాలు బిల్‌ గేట్స్‌ (Bill Gates), నారాయణమూర్తి (Narayana Murthy) పరస్పరం భిన్నమైన అభిప్రాయాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ (Shashi Tharoor) స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ రాజీకొస్తే.. ప్రస్తుతం మనం ఎక్కడున్నామో అక్కడికే వస్తామన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని ఇన్ఫోసిస్‌ (Infosys) వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) ఆ మధ్య వ్యాఖ్యానించారు. అప్పుడే అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ నిలవగలదని వ్యాఖ్యానించారు. ఆయన అభిప్రాయాన్ని కొంతమంది సీఈవోలు సమర్థించగా.. చాలా మంది నెటిజన్లు వ్యతిరేకించారు.

‘ఎలాన్‌ మస్క్‌ అయితే ఏంటీ.. అది తప్పే’: రిషి సునాక్‌ కీలక వ్యాఖ్యలు

ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్ (Microsoft) సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ (Bill Gates) కూడా దీనిపై ఇటీవల స్పందిస్తూ ‘పని గంటల’పై భిన్నమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కృత్రిమ మేధతో పనితీరులో శాశ్వత మార్పులు చోటుచేసుకుంటాయని, వారానికి మూడు పనిదినాలు సాధ్యమేనని అన్నారు. కొన్నాళ్లకు ఏఐతో మనుషులు కష్టపడాల్సిన అవసరం ఉండని దశకి చేరుకుంటామని తెలిపారు. దీంతో మరోసారి ‘పని గంటల’ అంశం తెరపైకి వచ్చింది.

ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ దీనిపై ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘వారానికి మూడు పనిదినాలు సాధ్యమని బిల్‌గేట్స్‌ చెబుతున్నారు. బిల్‌గేట్స్‌, నారాయణమూర్తి కలిసి కూర్చుని ఈ అంశంపై రాజీ కుదుర్చుకుంటే గనుక.. ప్రస్తుతం మనం పాటిస్తున్న వారానికి ఐదు రోజుల పని విధానం దగ్గరకే తిరిగి చేరుకుంటాం’’ అని అభిప్రాయపడ్డారు. థరూర్ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనికి కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు