Farmers Protest: ‘దిల్లీ చలో’ శాంతియుతంగానే చేస్తాం: రైతు నేత

Farmers Protest: దిల్లీ చలో కార్యక్రమంలో భాగంగా తాము శాంతియుతంగానే నగరం వైపు పయనిస్తామని రైతు నేత డల్లేవాల్‌ వెల్లడించారు.

Updated : 21 Feb 2024 11:07 IST

చండీగఢ్‌: భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో పంజాబ్, హరియాణా సరిహద్దుల్లో నిలిచిపోయిన తాము శాంతియుతంగానే దిల్లీ వైపు కవాతు చేస్తామని రైతు నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్ బుధవారం తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం తమ లక్ష్యం కాదని చెప్పారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం సహా పలు డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న రైతులు (Farmers Protest).. కేంద్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 11 గంటలకల్లా స్పందించాలని, లేకపోతే దిల్లీ చలో (Delhi Chalo) కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని మంగళవారం ప్రకటించారు.

అన్నదాతల డిమాండ్లపై భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం కాలయాపన చేస్తోందని డల్లేవాల్‌ ఆరోపించారు. దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా సరిహద్దుల్లో రక్షణ వలయాలు ఏర్పాటు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వమే వాటి తొలగింపునకు ఆదేశాలిచ్చి.. తమను నగరంలోకి ప్రవేశించేందుకు అనుమతించాలన్నారు. నిరసన తెలియజేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. కనీస మద్దతు ధరపై చట్టం విషయంలో కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడాన్ని తప్పుబట్టారు. 

మరోవైపు ఈరోజు డెడ్‌లైన్‌ ముగిసిన తర్వాత దిల్లీ వైపు తమ ప్రయాణం కొనసాగిస్తామని రైతు నాయకులు వెల్లడించిన నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. టిక్రీ, సింఘు, గాజీపూర్‌ సరిహద్దుపై గట్టి నిఘా ఉంచారు. దిల్లీ-గురుగ్రామ్‌, దిల్లీ-బహదూర్‌గఢ్‌ మార్గాల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అవసరమైతే కొన్ని మార్గాలను మూసివేస్తామని వాహనదారులను ముందే అప్రమత్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో రైతులను నగరంలోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. వారిని నిలువరించేందుకు భారీ ఎత్తున పోలీసు దళాలను రంగంలోకి దింపామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని