Amritpal Singh: అమృత్‌పాల్‌కు ఆశ్రయం.. హరియాణా మహిళ అరెస్టు..!

పరారీలో ఉన్న ఖలీస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ పంజాబ్‌ నుంచి మొదట హరియాణాలోకి వెళ్లినట్లు సమాచారం. అతనితోపాటు అతని సహచరుడికి ఆశ్రయం కల్పించిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు.

Published : 23 Mar 2023 22:08 IST

చండీగఢ్‌: పంజాబ్‌(Punjab)లో పోలీసుల నుంచి తప్పించుకున్న ఖలిస్థానీ(Khalistan) సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌(Amritpal Singh) తొలుత పొరుగు రాష్ట్రమైన హరియాణా(Haryana)కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆదివారం అక్కడ ఓ ఇంట్లో బస చేసి, మరుసటి రోజు ఉదయాన్నే వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే అమృత్‌పాల్‌తోపాటు అతని సహచరుడికి ఆశ్రయం ఇచ్చినట్లు అనుమానిస్తోన్న బల్జీత్‌ కౌర్‌ అనే మహిళను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. అమృత్‌పాల్‌, పాపల్‌ప్రీత్‌ సింగ్‌లు కలిసి ద్విచక్ర వాహనంపై కురుక్షేత్ర జిల్లాలోని తన ఇంటికి వచ్చినట్లు ఆమె పోలీసులకు తెలిపారు.

‘శాహ్‌బాద్‌లోని ఇంట్లో అమృత్‌పాల్‌తోపాటు అతనితో వచ్చిన వ్యక్తికి ఆశ్రయం కల్పించిన బల్జీత్ కౌర్ అనే మహిళను అదుపులోకి తీసుకున్నాం. అనంతరం పంజాబ్ పోలీసులకు అప్పగించాం’ అని కురుక్షేత్ర ఎస్పీ తెలిపారు. ఆ మహిళకు పాపల్‌ప్రీత్ సింగ్ రెండేళ్లుగా తెలుసని చెప్పారు. అతనే అమృత్‌పాల్‌ను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తూ కనిపించాడు. ప్రధాన నిందితుడికి అతను మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే  మహిళ ఇంటినుంచి ఇద్దరు బయటకు వెళ్లిపోతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. గొడుగు అడ్డుగా పెట్టుకుని జారుకుంటున్న వ్యక్తే అమృత్‌పాల్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు.

మరోవైపు.. అమృత్‌పాల్‌ ప్రైవేటు సెక్యూరిటీ సభ్యుడిగా భావిస్తోన్న, లుధియానాకు చెందిన తేజిందర్‌ సింగ్ గిల్‌ను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అజ్‌నాలా ఘటనలోనూ గిల్‌ ప్రమేయం ఉన్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. స్థానిక పోలీసులు అతనిపై విడిగా చర్యలు తీసుకుంటారని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. అమృత్‌పాల్‌ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు వరుసగా ఆరో రోజు ముమ్మరంగా వేట సాగిస్తున్నారు. పంజాబ్‌లోని తరన్‌ తారన్‌, ఫిరోజ్‌పూర్ జిల్లాలు మినహా మిగతా చోట్ల మొబైల్ ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు. ఈ రెండు జిల్లాల్లో శుక్రవారం మధ్యాహ్నం వరకు సేవలు నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని