Updated : 12 Sep 2021 17:24 IST

E-Books Apps: పుస్తక ప్రియుల కోసం ఇవిగో ఈ-బుక్స్ యాప్స్‌

ఇప్పుడంతా డిజిటల్‌యుగం. ఆధునిక కాలానికి ఇంటర్నెట్‌ చిరునామాగా నిలిచింది. సాంకేతికత ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఈ రోజుల్లో ప్రతిదీ స్మార్ట్‌ఫోన్‌లోనే పూర్తి చేసేయడం ఇప్పటి తరానికి అలవాటు. సమావేశాలు నిర్వహించడం నుంచి ఏదైనా నచ్చితే వెంటనే షేర్‌ చేయడం వరకూ అన్నీ అరచేతిలోనే జరిగిపోతున్నాయి. ఇంతకుముందు తరం ఎక్కువగా పేపర్‌, పుస్తక పఠనంపై  ఆస్తకి చూపేవారు. ఇప్పటికీ వాటిని చదివేవారు అధికంగా ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే సంఖ్య మాత్రం తక్కువనే చెప్పొచ్చు. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే చదివేసే నవతరం యువత కోసం పెద్ద సంస్థలు ఎన్నో యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. స్వదేశ రచయితల పుస్తకాలతోపాటు ఇతర దేశాలకు చెందిన బుక్స్‌ను వీటిల్లో సులువుగా చదివేయచ్చు. 

అల్డికో (Aldiko)

ఈ-రీడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో అల్డికో ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. ఈ-బుక్‌ను కొనుగోలు చేసే సమయంలో చాలా ఆప్షన్స్‌ను చూపిస్తుంది. అందులో అత్యుత్తమ ధరకే పుస్తకాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ డివైజ్‌లలోయాప్‌ అందుబాటులో ఉంది. ఈ-బుక్‌ షెల్ఫ్‌ను మీకు అనువుగా ఉంచుకునే వెసులుబాటును ఈ యాప్‌ కల్పించింది. యాప్‌లో ఫ్రీ వెర్షన్‌తోపాటు ప్రీమియం వెర్షన్‌ ఉంది. 

 

  ఆడిబుల్‌ (Audible)

ఆడిబుల్‌ స్పెషాలిటీ ఏంటో పేరులోనే ఉంది. కొందరు కొంత సమయం చదవడానికి ఇష్టపడతారు. కాసేపు ఎవరైనా వినిపిస్తే బాగుణ్ను కదా అనిపిస్తుంటుంది. అలాంటి వారి కోసం ఆడిబుల్‌ యాప్‌ చక్కగా సరిపోతుంది. ఈ-బుక్స్‌ను ఆడియోల రూపంలో వినేందుకు Audible యాప్‌లో అవకాశం ఉంటుంది. ఆడిబుల్‌ యాప్‌ ట్రయల్‌ పిరియడ్‌లో ఉండే ప్రైమ్‌ సభ్యులకు ఉచితంగా రెండు క్రెడిట్‌లను అమెజాన్‌ సంస్థ అందిస్తుంది. 

 

చిన్నారుల కోసం

ఎపిక్‌ (Epic) యాప్‌ ప్రత్యేకంగా చిన్నారుల కోసం రూపొందించినదే. పిల్లల నుంచి హైస్కూల్‌ విద్యార్థుల కోసం లక్షల పుస్తకాలను ఎపిక్‌లో ఎంచుకోవచ్చు. ఆడియోలు, వీడియోలు, పెద్ద పెద్ద పబ్లిషర్స్‌ ప్రచురించిన క్విజ్‌ ప్రతులు వంటివెన్నో అందుబాటులో ఉంటాయి. నేర్చుకోవాలి, చదవాలనే ఆకాంక్షను పిల్లల్లో పెంచేందుకు దోహదపడుతుంది. యూఎస్, కెనడాలోని విద్యార్థులకు ఎపిక్‌ యాప్‌ సేవలు ఉచితంగా లభిస్తుండగా... మిగిలినవారికి 30 రోజుల ఉచిత ట్రయల్‌ పీరియడ్‌ను కల్పించింది. ఆ తర్వాత నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ రుసుం దాదాపు రూ. 350 (4.9డాలర్లు)గా నిర్ధారించింది.

 

గూగుల్‌ ప్లే బుక్స్‌

ఆండ్రాయిడ్‌ యూజర్లు ఎక్కువగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటారని తెలుసు. అలానే పుస్తక ప్రియుల కోసం గూగుల్‌ సంస్థ గూగుల్‌ ప్లే బుక్స్ యాప్‌ను తీసుకొచ్చింది. యాపిల్‌ బుక్స్‌కు సమానంగా  గూగుల్‌ ప్లే బుక్స్ మరిన్ని ఈ-పుస్తకాలను యూజర్లకు అందుబాటులో ఉంచింది. పాఠకులు పుస్తకాలను ట్రాన్స్‌లేట్, డౌన్‌లోడ్‌ అవకాశం కల్పించింది. యాపిల్‌లానే గూగుల్‌ ప్లే బుక్స్‌ యాప్‌ సబ్‌స్క్రిప్షన్‌కు ఎలాంటి రుసుం లేదు. అయితే ఈ-పుస్తకం కోసం మాత్రం కొంత చెల్లించాల్సి ఉంటుంది. చదివేటప్పుడు యూజర్‌ కళ్లకు ఎఫెక్ట్‌ కాకుండా ఉండేలా మార్పులు చేసుకునే ఆప్షన్‌ గూగుల్‌ ప్లే బుక్స్ యాప్‌లో ఉంది. 

 

అద్దెకు ఈ-బుక్స్

మనం సాధారణంగా లైబ్రరీకి వెళ్లి పుస్తకాలను కొన్ని రోజులపాటు అద్దెకు తీసుకుంటూ ఉంటాం. దాని కోసం కొంతమొత్తం చెల్లిస్తుంటాం. అలానే ఈ-బుక్స్‌ను కూడా బాడుగకు తీసుకునే వెసులుబాటును ఓవర్‌డ్రైవ్‌ (Overdrive) కల్పించింది. ఈ-బుక్స్, ఆడియో బుక్స్, స్ట్రీమింగ్‌ వీడియోలను అద్దె ప్రాతిపదికన తీసుకోవచ్చు. అలానే ఈ-బుక్‌ రిటర్న్ చేయడంలో కాస్త లేటయితే జరిమానా కట్టాల్సిన అవసరం లేదు. ఒక వేళ యూజర్‌ స్థానికంగా ఉండే లైబ్రరీలో రిజిస్టర్‌ అయితే చాలు.. వేలాది లైబ్రరీ రిసోర్స్‌లకు ఉచితంగా యాక్సెస్‌ పొందే అవకాశం ఉంటుంది. ఓవర్‌డ్రైవ్‌ యాప్‌కు కొత్త వెర్షన్‌తో లిబ్బే (Libby) వచ్చేసింది. అయితే ఓవర్‌డ్రైవ్‌ యాప్‌లో ఉన్న ఫీచర్లు లిబ్బేలో లేనప్పటికీ.. వేగవంతంగా ఉండటంతో డిజిటల్‌ బ్రౌజింగ్‌ బాగుంటుందని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. 

 

కోబో బుక్స్ (kobo books)

ఈ-బుక్స్, ఆర్టికల్స్‌, ఆడియో బుక్స్ వంటివి దాదాపు 50 లక్షల టైటిల్స్‌తో కోబో (kobo)యాప్‌ పాఠకుల కోసం సిద్ధంగా ఉంటుంది. ఎలా కావాలంటే  అలా ఇంటర్‌ఫేస్‌ను మార్పు చేసుకునేందుకు యూజర్లకు యాప్‌  అవకాశం కల్పించింది. పేజీల లేఔట్‌ను మార్పు చేసుకుని చదువుకోవచ్చు. టెక్ట్స్‌కు సంబంధించి ఆంగ్లం, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్‌, జర్మన్, డచ్, పోర్చగీస్, బ్రెజీలియన్ పోర్చగీస్, జపనీస్‌ వంటి భాషల్లోకి అనువాదం చేసుకునే వీలుంది. 

 

స్క్రెబ్‌డ్‌ 

అన్ని జోనర్ల పుస్తకాలు దొరికే ప్రాంతం స్క్రెబ్‌డ్‌ యాప్‌. పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని రకాల బుక్స్‌ అందుబాటులో ఉంటాయి. క్రైమ్, రొమాన్స్, చరిత్ర, రాజకీయాలు, సైన్స్ వంటి ఇతర పుస్తకాలను చదువుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లోనూ ఈ-పుస్తకాలను డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు యాప్‌ అందుబాటులో ఉంది. ఈ-బుక్స్‌ను మీ బుక్‌మార్క్‌గా పెట్టుకునే ఆప్షన్‌ కల్పించింది. స్క్రెబ్‌డ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభ ధర నెలకు దాదాపు రూ. 1,020(13.99 డాలర్లు)గా ఉండొచ్చు.

 

 యాపిల్‌ బుక్స్‌ (Apple Books)

తమ యూజర్ల కోసం యాపిల్‌ సంస్థ తీసుకొచ్చిన యాప్‌ Apple Books. లైబ్రరీ అంటే పుస్తకాల సమూహం. యాపిల్‌ బుక్స్‌ కూడా వేలాది పుస్తకాల లైబ్రరీకి సమానం. ఇందులో మరొక ప్రత్యేక ఫీచర్‌ ఏమిటంటే.. బుక్స్‌ అమరికను నిర్వహించడం. చదవడం పూర్తైన బుక్స్‌, చదవాల్సిన బుక్స్, ఆడియో బుక్స్.. అంతే కాకుండా బుక్ క్లబ్స్‌లోకి జాయిన్‌ అయ్యే ఆప్షన్‌ను కల్పించింది. సబ్‌స్క్రిప్షన్‌కు ఎలాంటి రుసుం లేనప్పటికీ.. బుక్స్ కోసం మాత్రం కొంతమొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా వారం, నెల, సంవత్సర ఫీజును యాపిల్‌ వసూలు చేస్తుంది. అంతేకాకుండా ప్రత్యేక ఆఫర్లు, ఉచిత పుస్తకాలు వంటివి కూడా యూజర్ల కోసం అందిస్తుంటుంది. 

 -ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని