అత్యధిక సంపన్న నటుల జాబితాలో అక్షయ్‌

బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ప్రపంచంలోనే అత్యధిక సంపన్న నటుల జాబితాలో చేరారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పారితోషకం అర్జిస్తున్న మొదటి పది సెలబ్రిటీల జాబితాను 2020 సంవత్సరానికి..

Published : 13 Aug 2020 02:25 IST

దిల్లీ: బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ప్రపంచంలోనే అత్యధిక సంపన్న నటుల జాబితాలో మరోసారి చేరారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పారితోషకం అర్జిస్తున్న మొదటి పది మంది సెలబ్రిటీల జాబితాను 2020 సంవత్సరానికి గాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్‌ నుంచి కేవలం అక్షయ్‌ ఒక్కరే చోటు దక్కించుకోవడం విశేషం. అక్షయ్‌ 48.5 మిలియన్‌ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం రూ.363కోట్లు) ఆదాయంతో ఆరో స్థానంలో నిలిచారు. అయితే అక్షయ్‌ గతేడాది నాలుగో స్థానంలో ఉండగా.. ఈ ఏడాది రెండు స్థానాలు కిందకు దిగి ఆరోస్థానంలో నిలిచారు. ఈ జాబితాలో హాలీవుడ్‌ నటుడు డ్వేన్‌ జాన్సన్‌ 87.5 మిలియన్‌ డాలర్లతో తొలి స్థానంలో నిలవగా.. గతేడాది కూడా ఆయనది మొదటిస్థానమే. ఇక డెడ్‌పూల్‌ స్టార్‌ ర్యాన్ రెనాల్డ్ 71.5 మిలియన్ల డాలర్లతో రెండో స్థానాన్ని ఆక్రమించారు. నటులు మార్క్‌ వాల్బర్గ్‌, బెన్ అఫ్లెక్‌, విన్‌ డీజిల్‌ మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో చోటు దక్కించుకున్నారు.

ఇక అక్షయ్‌ కుమార్‌ అమెజాన్‌ ప్రైమ్‌ సిరీస్‌ ‘ది ఎండ్‌’ షోలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు గాను అక్షయ్‌ పది మిలియన్‌ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఫోర్బ్స్‌ తన ప్రకటనలో తెలిపింది. అయితే, అక్షయ్‌ సినిమాల కంటే ప్రకటనల ద్వారానే ఎక్కువ ఆదాయం అర్జిస్తున్నట్లు పేర్కొంది. సినిమాల విషయానికి వస్తే.. అక్షయ్ చేతిలో ‘బెల్ బాటమ్’, ‘బచ్చన్‌ పాండే’, ‘లక్ష్మీబాంబ్‌’, ‘పృథ్వీరాజ్‌’ తదితర చిత్రాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని