Aadikeshava Movie Review: రివ్యూ: ఆదికేశవ.. వైష్ణవ్‌తేజ్‌, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రం ఎలా ఉంది?

Aadikeshava Movie Review: వైష్ణవ్‌తేజ్‌ కథానాయకుడిగా శ్రీకాంత్ ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

Updated : 24 Nov 2023 12:49 IST

Aadikeshava Movie Review; చిత్రం: ఆదికేశవ; న‌టీన‌టులు: వైష్ణ‌వ్‌తేజ్‌, శ్రీలీల‌, జోజు జార్జ్‌, సుమ‌న్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, సుద‌ర్శ‌న్‌, అప‌ర్ణాదాస్ త‌దిత‌రులు; ఎడిటింగ్‌: న‌వీన్ నూలి; సినిమాటోగ్రఫీ: డ‌డ్లీ; సంగీతం: జి.వి.ప్ర‌కాశ్‌కుమార్‌; క‌ళ‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌; నిర్మాణం: సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయిసౌజ‌న్య‌; ద‌ర్శ‌క‌త్వం:  శ్రీకాంత్ ఎన్‌.రెడ్డి; సంస్థ‌: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌; విడుద‌ల‌: 24-11-2023

మాస్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కి కేరాఫ్ తెలుగు ప‌రిశ్ర‌మ‌. ప్రేక్ష‌కుల అభిరుచులు ఎంత‌గా మారినా... కొత్త ర‌క‌మైన క‌థ‌ల హ‌వా కొన‌సాగుతున్నా అప్పుడ‌ప్పుడూ ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలూ బాక్సాఫీసు ద‌గ్గ‌ర వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తుంటాయి. అందుకే మ‌న హీరోలు, ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు త‌ర‌చూ మాస్ మ‌సాలా క‌థ‌ల‌పై మొగ్గు చూపుతూ ఉంటారు. విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్ర‌యాణం మొద‌లుపెట్టిన వైష్ణ‌వ్‌తేజ్‌.. ఈసారి ప‌క్కా మాస్ క‌థ‌తో ‘ఆదికేశ‌వ‌’ (Aadikeshava) చేశారు. ప‌లు మార్లు వాయిదా ప‌డినా... వైష్ణవ్ - శ్రీలీల జోడీగా న‌టించ‌డం, సితార సంస్థ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి కొన‌సాగుతూ వ‌చ్చింది. (Aadikeshava Movie Review) ఎట్ట‌కేల‌కి శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉంది?వైష్ణవ్‌, శ్రీలీల జోడీ మెప్పించిందా?

క‌థేంటంటే: త‌ల్లిచాటు బిడ్డ‌లా గారాబంగా పెరిగిన యువ‌కుడు బాలు (వైష్ణ‌వ్‌తేజ్‌). స్నేహితుడితో క‌లిసి బ‌లాదూర్‌గా తిరుగుతుంటాడు. పేరుకి బ‌లాదూర్ కానీ... క‌ళ్ల ముందు అన్యాయం జ‌రుగుతుందంటే, ఎంత‌టివాళ్ల‌నైనా ఎదిరించే త‌త్వం. చిన్న పిల్ల‌లు, మ‌హిళ‌లంటే ఎంతో ప్రేమ. త‌ల్లిదండ్రుల బ‌ల‌వంతంతో ఓ కాస్మొటిక్ కంపెనీలో ఉద్యోగంలో చేర‌తాడు. ఇంట‌ర్వ్యూలోనే కంపెనీ సీఈవో చిత్రావ‌తి (శ్రీలీల‌) కి బాగా న‌చ్చుతాడు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌తారు. ఇంత‌లో రాయ‌ల‌సీమ‌లోని బ్ర‌హ్మ స‌ముద్రం నుంచి ఓ పెద్దాయ‌న వ‌చ్చి బాలుకు అస‌లైన కుటుంబం వేరే ఉంద‌ని, త‌న అస‌లు పేరు రుద్ర కాళేశ్వ‌ర్‌రెడ్డి అని త‌న‌తో పాటు ఊరికి తీసుకెళ‌తాడు. ఇంత‌కీ బాలు ఎవ‌రు? అత‌ని కుటుంబం క‌థేమిటి? బ‌్ర‌హ్మ స‌ముద్రం వెళ్లాక అక్క‌డ ఎన్నో అరాచ‌కాలు సాగిస్తున్న ప‌ది త‌ల‌ల రావ‌ణుడిలాంటి చెంగారెడ్డి (జోజు జార్జ్‌)ని ఎలా ఢీ కొట్టాడు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా  (Aadikeshava) చూడాల్సిందే!

ఎలా ఉందంటే: క‌థానాయ‌కుల్ని ఊరించే అంశం...  మాస్ ఇమేజ్. మాస్ హీరో అనిపించుకోవాల‌నే ప్ర‌య‌త్నంలో వీరోచితమైన హీరోయిజం, యాక్ష‌న్ అంశాలున్న క‌థాంశాల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటారు. ఇక పేరున్న కుటుంబాల నుంచి వ‌చ్చిన క‌థానాయ‌కులైతే తొలి అడుగుల్లోనే ఆ త‌ర‌హా ప్ర‌య‌త్నాలతో స‌త‌మ‌త‌మ‌వుతూ క‌నిపిస్తుంటారు. మెగా కుటుంబం నుంచి వ‌చ్చిన వైష్ణ‌వ్‌తేజ్ త‌న నాలుగో చిత్రమైన ‘ఆదికేశ‌వ‌’తో ఆ ప్ర‌య‌త్నం చేశారు. యాక్ష‌న్‌, సీమ ఫ్యాక్ష‌న్‌, ప్రేమ‌, సెంటిమెంట్ త‌దిత‌ర అంశాల మేళ‌వింపుతో కూడిన కథ ఇది. (Aadikeshava Movie Review in telugu) ఒక‌ట్రెండు మ‌లుపులు త‌ప్ప క‌థ‌లో కానీ, క‌థ‌నంలో కానీ కొత్త‌ద‌న‌మేమీ క‌నిపించ‌దు. పాత రోజుల్లో వ‌చ్చిన ఫ్యాక్ష‌న్ సినిమాల్లాగే ఓ ఫార్ములాతో క‌థ‌ని చెప్పారు ద‌ర్శ‌కుడు.  హైద‌రాబాద్‌లో స్నేహం, ప్రేమ‌, కుటుంబ అంశాల‌తో ప్ర‌థ‌మార్ధం స‌ర‌దా స‌ర‌దాగా కాల‌క్షేపంగా సాగిపోతుంది. విరామం స‌మ‌యానికి  ఓ మ‌లుపు.

ద్వితీయార్ధం క‌థంతా సీమ‌లోని బ్ర‌హ్మ స‌ముద్రంలో చెంగారెడ్డితో ఢీ కొట్ట‌డంతో సాగిపోతుంది. ఈ క‌థ‌లో ప్రేమ‌, కుటుంబ బంధాలు, డ్రామా, ఊరిలో అరాచ‌కాలు, రాజ‌కీయం త‌దిత‌ర అంశాలున్నా ఏ ఒక్క అంశాన్నీ బ‌లంగా స్పృశించ‌క‌పోవ‌డం కాస్త మైన‌స్.  హీరో హీరోయిన్ క‌ల‌వ‌గానే ఓ పాట‌, విల‌న్ హీరో ఎదురుప‌డ‌గానే ఓ ఫైట్ అన్న‌ట్టే సాగుతుంది త‌ప్ప భావోద్వేగాల‌తో క‌ట్టిప‌డేసే స‌న్నివేశాలు.. త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఉత్సుక‌తని రేకెత్తించే అంశాలు పెద్దగా క‌నిపించ‌వు. (Aadikeshava Movie Review in telugu) ‘నువ్వు మా బిడ్డ‌వి కాదు, నీ త‌ల్లిదండ్రులు వేరే’ అని పాతికేళ్లు పెంచిన త‌ల్లి చెప్ప‌డం... ఆ మాట విని వ‌చ్చిన‌ వాళ్ల‌తో హీరో వెళ్లిపోవడం లాంటి స‌న్నివేశాలు స‌హ‌జంగా అనిపించ‌వు. ఇలా తర్కానికి అంద‌ని స‌న్నివేశాలు సినిమాలో చాలానే ఉంటాయి.  ర‌చ‌న‌లో బ‌లం లేక‌పోయినా ద‌ర్శ‌కుడి మేకింగ్‌లో స్ప‌ష్ట‌త క‌నిపిస్తుంది. చెప్పాల‌నుకున్న‌ది త‌న సాంకేతిక బృందంతో క‌లిసి స్ప‌ష్టంగా తెర‌పైకి తీసుకొచ్చారు.

ఎవ‌రెలా చేశారంటే: వైష్ణ‌వ్‌తేజ్  ప్ర‌థ‌మార్ధంలో బాలుగా ప‌క్కింటి కుర్రాడి త‌ర‌హాలో క‌నిపిస్తారు. ద్వితీయార్ధంలో రుద్ర‌కాళేశ్వ‌ర్‌రెడ్డిగా వీరోచితాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ క‌నిపించారు. త‌న పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. మాస్ క‌థ‌లోనూ స‌హ‌జంగా ఒదిగిపోయే ప్ర‌య‌త్నం చేశాడు. శ్రీలీల అందంతో క‌ట్టిప‌డేసింది. పాట‌ల్లో ఆమె త‌న  ప్ర‌తిభ‌ని మ‌రోసారి ప్ర‌ద‌ర్శించింది. డ్యాన్స్ స‌న్నివేశాల‌తోనే ఆమె పాత్ర ప‌రిచ‌యమవుతుంది. వైష్ణ‌వ్‌తేజ్ త‌ల్లిదండ్రులుగా  రాధిక‌, జేపీ క‌నిపిస్తారు. (Aadikeshava Movie Review) జోజు జార్జ్ క్రూర‌మైన విల‌న్‌గా క‌నిపించినా... ఆ పాత్ర ప్రభావవంతంగా లేదు. అప‌ర్ణాదాస్‌, సుమ‌న్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. సుద‌ర్శ‌న్ అక్క‌డ‌క్క‌డా న‌వ్వించారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. డ‌డ్లీ విజువ‌ల్స్ ఆక‌ట్టుకుంటాయి. జీవీ ప్ర‌కాశ్ పాట‌లు గుర్తు పెట్టుకునేలా లేవు. నేప‌థ్య సంగీతం బాగుంది. మిగ‌తా విభాగాల‌న్నీ మంచి ప‌నితీరునే క‌న‌బ‌రిచాయి. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది. ద‌ర్శ‌కుడు శ్రీకాంత్  ఎన్‌.రెడ్డి  ర‌చ‌న‌లో బ‌లం లేదు. పాత క‌థ‌ని పాత ప‌ద్ధ‌తుల‌తోనే చెప్పారు.

  • బ‌లాలు
  • + వైష్ణ‌వ్‌, శ్రీలీల జోడీ
  • + మ‌లుపులు
  • + అక్క‌డ‌క్క‌డా హాస్యం
  • బ‌ల‌హీన‌త‌లు
  • - కొత్త‌ద‌నం లేని క‌థ‌, క‌థ‌నం
  • - కొర‌వ‌డిన భావోద్వేగాలు
  • చివ‌రిగా...: ఆది కేశ‌వ...  సాధార‌ణంగా సాగే ఓ యాక్ష‌న్ సినిమా (Aadikeshava Movie Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని