సంక్షిప్త వార్తలు (5)

సంక్రాంతి బరిలో సందడి చేసేందుకు చకచకా సిద్ధమవుతున్నారు కథానాయకుడు అజిత్‌. ఆయన ప్రస్తుతం హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘తునివు’. జీ స్టూడియోస్‌తో కలిసి బోనీకపూర్‌ నిర్మిస్తున్నారు.

Updated : 05 Dec 2022 06:23 IST

‘తునివు’ జోరు  

సంక్రాంతి బరిలో సందడి చేసేందుకు చకచకా సిద్ధమవుతున్నారు కథానాయకుడు అజిత్‌. ఆయన ప్రస్తుతం హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘తునివు’. జీ స్టూడియోస్‌తో కలిసి బోనీకపూర్‌ నిర్మిస్తున్నారు. నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఆదివారం ఈ చిత్రం నుంచి ఓ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. అందులో అజిత్‌ తుపాకీ చేతబట్టి స్టైలిష్‌ లుక్‌తో కనిపించారు. ఈ చిత్ర తొలి గీతం ‘‘చిల్లా చిల్లా’’ను త్వరలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు తెలిపారు. వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందుతోన్న ఈ సినిమాకి జిబ్రాన్‌ స్వరాలందిస్తున్నారు. నీరవ్‌ షా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.


ధనుష్‌ సినిమా కోసం...

భాషలోనైనా సరే ఇప్పుడు దాదాపు సినిమాలు పాన్‌ ఇండియా హంగులతోనే రూపొందుతున్నాయి. నటుల్ని, సాంకేతిక బృందాన్ని అందుకు తగ్గట్టే ఎంపిక చేసుకుంటుంటారు దర్శక నిర్మాతలు. సినిమా ఎక్కడెక్కడైతే ప్రధానంగా మార్కెట్‌ అవుతుందో... ఆయా భాషలకి చెందిన నటులు తెరపై కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాంతో ఏ భాష నుంచి ఏ నటుడు, ఏ పాత్రలో కనిపిస్తారో ఊహించలేని పరిస్థితి. తాజాగా ధనుష్‌ సినిమా కోసం సంజయ్‌దత్‌ని సంప్రదించినట్టు సమాచారం. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో విలన్‌ పాత్ర కోసం సంజయ్‌దత్‌ని ఎంపిక చేసుకునే దిశగా చిత్రబృందం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ‘కేజీఎఫ్‌ 2’లో సంజయ్‌దత్‌ విలన్‌గా మెప్పించి, ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే.


ఇదే గెటప్‌తో ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’

‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’ ప్రాజెక్టు మొదలైన దగ్గర్నుంచి అన్నీ సంచలనాలే. పేరు మార్పు, భారీ తారాగణం, విడుదల తేదీ.. ఇవన్నీ వార్తలే. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాని సాజిద్‌ నడియాద్‌వాలాతో కలిసి బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ నిర్మిస్తూ, నటిస్తున్నారు. తాజాగా చిత్ర షూటింగ్‌ పూర్తైంది. అందుకు సంబంధించిన ఓ షూటింగ్‌ పొటోని సల్మాన్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అందులో పొడవాటి జుట్టు, భారీ గడ్డంతో కనిపిస్తున్నారు. ‘షూటింగ్‌ పూర్తైంది. ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’ వచ్చే ఏడాది ఈద్‌కి వస్తున్నాడు’ అని ఫొటోకి ట్వీట్‌ జోడించారు. ఫర్హాద్‌ షంజీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్‌, పూజా హెగ్డే, జగపతిబాబు, భాగ్యశ్రీ, హెహ్‌నాజ్‌ గిల్‌, భూమికా చావ్లా.. కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ఆసుపత్రిలో.. బాలీవుడ్‌ సీనియర్‌ నిర్మాత

బాలీవుడ్‌ సీనియర్‌ నిర్మాత నితిన్‌ మన్మోహన్‌ గుండెనొప్పితో ఆదివారం ముంబయి ఆసుపత్రిలో చేరారు. ‘లాడ్లా’, ‘దస్‌’, ‘భాఘీ’, ‘రెడీ’లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారాయన. ‘నితిన్‌ ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఛాతీలో తీవ్రమైన నొప్పి వచ్చింది. శ్వాస సైతం సరిగా తీసుకోలేకపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన కోకిలాబెన్‌ అంబానీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి క్లిష్టంగానే ఉంది. నలభై ఎనిమిది గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేం అని వైద్యులు అంటున్నారు’ అంటూ నితిన్‌ స్నేహితుడు ఖలీంఖాన్‌ పరిస్థితి వివరించారు.


ఇది అరుదైన చిత్రం

చైతన్య రావు, అలెగ్జాండర్‌ సాల్నికోవ్‌, ప్రియా పాల్వాయి, ఖ్యాతి లీన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఏ జర్నీ టు కాశీ’. మునికృష్ణ దర్శకుడు. దొరడ్ల బాలాజీ, శ్రీధర్‌ వారణాసి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో చైతన్య రావు మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా అరుదైన చిత్రం. మంచి కథతో తెరకెక్కింది. వాస్తవికతకు దగ్గరగా సహజంగా ఉంటుంది. ఇలాంటి సినిమాలో భాగమైనందుకు గర్వపడుతున్నా’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో కాశీ విశిష్టత గురించి గొప్పగా చెప్పారు. ఇందులో అందమైన ప్రేమకథ కూడా ఉంది’’ అంది నాయిక ఖ్యాతి లీన్‌. ‘‘రోడ్డు ప్రయాణ నేపథ్యంలో సాగే కథతో రూపొందిన చిత్రమిది. కాశీ యాత్ర కొంతమంది జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో తెలియాలంటే మా చిత్రం చూడాలి’’ అన్నారు దర్శకుడు. మంచి సినిమాని అందరూ విజయవంతం చేస్తారనే నమ్మకం ఉందన్నారు నిర్మాతలు. సంగీతం: ఫణికల్యాణ్‌, ఛాయాగ్రహణం: గోకుల్‌ భారతి, శ్రీసాయి.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు