Cinema News: సినిమా కలలతో... ‘కొంచెం హట్కే’

గురుచరణ్‌, కృష్ణ మంజూష ప్రధాన పాత్రధారులుగా... అవినాష్‌ కుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘కొంచెం హట్కే’. అభిమాన థియేటర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. ఈ నెల 26న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 14 Apr 2024 13:20 IST

గురుచరణ్‌, కృష్ణ మంజూష ప్రధాన పాత్రధారులుగా... అవినాష్‌ కుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘కొంచెం హట్కే’. అభిమాన థియేటర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. ఈ నెల 26న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. దర్శకురాలు నందినిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘భిన్న ప్రపంచాల నుంచి వచ్చిన వ్యక్తులంతా కలిసి ఓ సినిమా తీయాలనుకోవడమే ఇందులో కథ. సినిమా తీశారా? వాళ్ల కలలు నెరవేరాయా? అనేది తెరపైనే చూడాలి’’ అన్నారు. కృష్ణ మంజూష. ఈ కార్యక్రమంలో రచయిత కృష్ణ రావూరి, సాయి తదితరులు పాల్గొన్నారు.


తెలుసుకోరా వెనకా ముందరా...

ర్ట్స్‌.. సైన్స్‌.. ఇంగ్లిష్‌ కంటే ముందరా... తెలుసుకోరా జరిగేదేంటో వెనకా ముందరా... అంటూ  ‘జితేందర్‌ రెడ్డి’ పాటతో సందడిని షురూ చేశాడు. కళాశాలలో విద్యార్థి నాయకుడిగా, తన ప్రాంతంలో జరిగే అన్యాయాల్ని ఎదుర్కొనేందుకు ధైర్యంగా అడుగేసిన యువకుడిగా ఆయన సమాజంపై ఎలాంటి ప్రభావం చూపించారో తెలియాలంటే ‘జితేందర్‌ రెడ్డి’ చూడాల్సిందే. రాకేశ్‌ వర్రె కథానాయకుడిగా నటించిన చిత్రమిది. వైశాలి రాజ్‌, రియా సుమన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. విరించివర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ముదుగంటి రవీందర్‌ రెడ్డి నిర్మాత. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలోని ‘అఆఇఈఉఊ...’ అంటూ సాగే పాటని విడుదల చేశారు.


నవ్వించాలనే లక్ష్యం నెరవేరింది

‘‘భయపెట్టడం కంటే కూడా... నవ్వించాలనే ఉద్దేశంతోనే ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమాని చేశాం. థియేటర్‌కి వెళ్లిన ప్రేక్షకులంతా కోన వెంకట్‌ మార్క్‌ వినోదాన్ని ఆస్వాదిస్తూ, హాయిగా నవ్వుకుంటున్నారు’’ అన్నారు శివ తుర్లపాటి. నృత్య దర్శకుడైన ఆయన, ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమాతో మెగాఫోన్‌ చేతపట్టారు. అంజలి ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శివ తుర్లపాటి శనివారం విలేకర్లతో ముచ్చటించారు. ఇది సీక్వెల్‌ సినిమా, అంజలి 50వ సినిమా అనే ఒత్తిళ్లని తీసుకోకుండా చేశా. నవ్వించాలనే లక్ష్యం నెరవేరింది. మూడో భాగం సినిమా త్వరలోనే ఉంటుంది’’ అన్నారు శివ తుర్లపాటి.


మట్టి మనుషుల కథ.. శరపంజరం

వీన్‌కుమార్‌ గట్టు హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘శరపంజరం’. లయ కథానాయిక. టి.గణపతిరెడ్డి నిర్మాణ సహకారం అందించారు. ఈ చిత్రం ఈ నెల 19న రానున్న సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ అతిథిగా హాజరై ట్రైలర్‌ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘జోగిని వ్యవస్థ, గంగిరెద్దుల్ని ఆడించే సంచార జాతుల వెతల నేపథ్యంలో తీసిన చిత్రమిది. మట్టి మనుషుల జీవితాల్ని తీసుకుని, తొలి ప్రయత్నంలోనే సామాజిక చైతన్యం కోసం పాటుపడే చిత్రాన్ని తీసిన నవీన్‌ గట్టుకు అభినందనలు’’ అన్నారు.


‘మేకప్‌ మ్యాన్‌’ల జీవితం ఆధారంగా

ప్రముఖ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం మేనల్లుడు శ్రీకాంత్‌ అవుటూరి కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘మేకప్‌ మ్యాన్‌’. దివాకర్‌ యడ్ల దర్శకుడు. కుమార్‌ మెట్టుపల్లి నిర్మాత. శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. దర్శకుడు రవికుమార్‌ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నిచ్చారు. నిర్మాత సాయివెంకట్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, భరత్‌ పారేపల్లి గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘‘చిత్ర పరిశ్రమలో మేకప్‌ మ్యాన్‌ ప్రాముఖ్యత చాలా కీలకం. వాళ్ల జీవితాల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెడతాం’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని