Aa okkati adakku: మండు వేసవిలో హాయిగా నవ్వించే చిత్రం

‘‘పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాల్ని అందరికీ తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో తీసిన చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు అల్లరి నరేశ్‌. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని మల్లి అంకం తెరకెక్కించారు.

Updated : 03 May 2024 09:52 IST

‘‘పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాల్ని అందరికీ తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో తీసిన చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు అల్లరి నరేశ్‌. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని మల్లి అంకం తెరకెక్కించారు. రాజీవ్‌ చిలక నిర్మాత. ఫరియా అబ్దుల్లా కథానాయిక. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఇటీవల విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. అడివి శేష్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేశ్‌ మాట్లాడుతూ.. ‘‘నేను ఇన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నానంటే కారణం మా నాన్న ఈవీవీ సత్యనారాయణ. ఆయన ఉన్నన్ని రోజులు నాతో సినిమాలు చేసి, హిట్లు ఇచ్చి, నన్ను మంచి నటుడిగా నిలబెట్టారు. ఆయన లేనప్పుడు కూడా మాకు తన టైటిల్‌ ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు. దీన్ని బరువు, బాధ్యతగా భావిస్తున్నా. తప్పకుండా ఆ మంచి పేరును కాపాడతానని మాటిస్తున్నా. ఈ మండు వేసవిలో మీ బాధలన్నీ మర్చిపోయి రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునే చిత్రమిది. పెళ్లి కాని వాళ్లు, పెళ్లైన వాళ్లు, పెళ్లి సంబంధాలు చూస్తున్న వారు.. అందరూ చూడాల్సిన సినిమా ఇది. థియేటర్స్‌కు వచ్చి సరదాగా నవ్వుకోండి’’ అన్నారు. ‘‘అందర్నీ అలరించే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. రాజీవ్‌ చిలక ఎక్కడా రాజీ పడకుండా చక్కటి క్వాలిటీతో నిర్మించారు’’ అన్నారు దర్శకుడు మల్లి అంకం. నిర్మాత రాజీవ్‌ మాట్లాడుతూ.. ‘‘కామెడీలో నరేశ్‌ను మించి ఎవరూ లేరు. తన ఆలోచనలు చాలా ఈ సినిమాలో ఉన్నాయి. అందర్నీ మెప్పించే చిత్రమిది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్‌ కనకమేడల, విజయ్‌ బిన్నీ, అబ్బూరి రవి, ఫరియా అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని