
Janhvi Kapoor: ఎన్టీఆర్ సరసన జాన్వీ?
శ్రీదేవి తనయ జాన్వీకపూర్ తెలుగు తెరపై మెరిసే సమయం ఆసన్నమైందా? ఈ ప్రశ్నకి అవుననే సమాధానాన్నే వినిపిస్తున్నాయి టాలీవుడ్ వర్గాలు. జాన్వీ తెలుగు సినిమాల్లో నటిస్తుందనే ప్రచారం ఇప్పటిదేమీ కాదు. ఆమె తెలుగు సినిమాతోనే పరిచయం కానుందని కూడా అప్పట్లో చెప్పుకున్నారు. కొందరు నిర్మాతలు ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఆమె మాత్రం హిందీ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడైతే ఒకప్పటిలాగా హిందీ, తెలుగు అని భాషా పరమైన హద్దులేమీ లేవు. ఎక్కడ సినిమా చేసినా దేశంలోని భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలూ చూస్తున్నారు. తెలుగులో అగ్ర తారల సినిమాలన్నీ కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందుతున్నాయి. దాదాపు సినిమాల్లో బాలీవుడ్‌కి చెందిన కథానాయికలే నటిస్తున్నారు. ఈ దశలోనే జాన్వీ కపూర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రెండు ప్రధానమైన సినిమాల్లో ఆమె పేరు వినిపిస్తోంది. ఒకటి ఎన్టీఆర్ సినిమా కాగా, మరొకటి విజయ్ దేవరకొండ చిత్రం. ఎన్టీఆర్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం కోసం బుచ్చిబాబు క్రీడానేపథ్యంతో కూడిన ఓ కథని సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ సినిమాకోసం కథానాయికగా జాన్వీని సంప్రదించినట్టు సమాచారం. అలాగే విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కలయికలోనూ మరో సినిమా ప్రచారంలో ఉంది. ‘లైగర్’ తర్వాత ఆ సినిమా పట్టాలెక్కుతుందని, అందులో కూడా కథానాయికగా జాన్వీ దాదాపు ఖాయమని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.