Ba Raju: అభిమానిగా వచ్చి... అనుబంధం పెంచుకుని...

సినిమా తీయడం ఒకెత్తు.. దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు అంటుంటారు చిత్రసీమలో! ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో సినిమాలకి ప్రచారం చేయడంలో దిట్ట...

Published : 23 May 2021 00:30 IST

సినిమా తీయడం ఒకెత్తు.. దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు అంటుంటారు చిత్రసీమలో! ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో సినిమాలకి ప్రచారం చేయడంలో దిట్ట... బి.ఎ.రాజు. తెలుగు సినీ పరిశ్రమతో ఆయనది నాలుగు దశాబ్దాలకిపైగా సాగిన అనుబంధం. చివరి క్షణాల వరకు సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదు. ప్రేక్షకులకీ, చిత్రబృందానికి అనుసంధానకర్తలా వ్యవరిస్తూ ప్రచారం చేయడం ఆయన శైలి. నిన్నటితరం నుంచి నేటి తరం వరకు పరిశ్రమలో అందరితోనూ అదే రకమైన అనుబంధాన్ని కొనసాగించారు. అందుకే బి.ఎ.రాజు ఇక లేరనే విషయం తెలియగానే చిత్రసీమ శోకసంద్రంలో మునిగిపోయింది.  హిందీ, తమిళ సినీ పరిశ్రమ వర్గాల ప్రముఖులు, కథానాయకులు, రాజకీయనాయకులు సైతం బి.ఎ.రాజు హఠాన్మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

కృష్ణకి వీరాభిమాని: బి.ఎ.రాజు స్వస్థలం విజయవాడ. ప్రముఖ కథానాయకుడు కృష్ణకి వీరాభిమాని. ఆయన పిలుపుతోనే సినీ రంగంలోకి అడుగుపెట్టారు. కృష్ణ కూడా బి.ఎ.రాజుని కుటుంబ సభ్యుడిలా చూసేవారు. ఆయన సినిమాలకే కాదు, మహేష్‌కీ వ్యక్తిగత పీఆర్వో బి.ఎ.రాజే. కృష్ణకి వీరాభిమాని అయినా... పరిశ్రమలో ఇతర కథానాయకులతోనూ సన్నిహిత సంబంధాలు నెరిపేవారు. వెంకటేష్‌, నాగార్జున, ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రాజశేఖర్‌, విశాల్‌... ఇలా పలువురు అగ్ర కథానాయకులకి, కథానాయికలకి, దర్శకనిర్మాతలకి వ్యక్తిగత పీఆర్వోగా పనిచేశారు. తన భార్య బి.జయ దర్శకురాలు కావడంతో ఆమె తీసే చిత్రాల్ని బి.ఎ.రాజు స్వయంగా నిర్మించారు. ‘ప్రేమలో పావని కళ్యాణ్‌’, ‘చంటిగాడు’, ‘ప్రేమికులు’, ‘గుండమ్మగారి మనవడు’, ‘సవాల్‌’, ‘లవ్‌లీ’, ‘వైశాఖం’ చిత్రాలు ఆ ఇద్దరి కలయికలో వచ్చినవే. 2018లో బి.జయ మరణించిన తర్వాత మళ్లీ నిర్మాణంవైపు వెళ్లలేదు బి.ఎ.రాజు. ఈ దంపతులకి తనయులు శివకుమార్‌, అరుణ్‌కుమార్‌ ఉన్నారు. శివకుమార్‌ దర్శకుడిగా రాణిస్తున్నారు. అరుణ్‌కుమార్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ రంగంలో స్థిరపడ్డారు.

బి.ఎ.రాజు అంత్యక్రియలు శనివారం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో జరిగాయి. కథానాయకుడు శ్రీకాంత్‌, దర్శకుడు సముద్రతోపాటు, పలువురు సినీ ప్రముఖులు, పాత్రికేయులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని