Rajamouli: బాహుబలి విశ్వాన్ని మరింత విస్తరింపజేస్తాం

‘బాహుబలి’ సినిమాలతో సినీప్రియుల్ని అలరించారు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఇప్పుడీ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న యానిమేటెడ్‌ సిరీస్‌ ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’. దీనికి జీవన్‌ జె.కాంగ్‌, నవీన్‌ జాన్‌ దర్శకత్వం వహించారు.

Updated : 08 May 2024 09:35 IST

రాజమౌళి

‘బాహుబలి’ సినిమాలతో సినీప్రియుల్ని అలరించారు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఇప్పుడీ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న యానిమేటెడ్‌ సిరీస్‌ ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’. దీనికి జీవన్‌ జె.కాంగ్‌, నవీన్‌ జాన్‌ దర్శకత్వం వహించారు. గ్రాఫిక్‌ ఇండియా, ఆర్కా మీడియా వర్క్స్‌ ప్రై.లి సంస్థలతో కలిసి రాజమౌళి, శరద్‌ దేవరాజన్‌, శోభు యార్లగడ్డ నిర్మించారు. ఇది ఈ నెల 17న ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘బాహుబలి సినిమా ప్రపంచాన్ని సృష్టించే సమయంలో అందులోని ప్రతి పాత్రకు సంబంధించిన పూర్తి స్టోరీని రాసి పెట్టుకున్నాం. కాకపోతే ఆ మొత్తం కథను రెండు భాగాల్లో ప్రేక్షకులకు చెప్పడం అసాధ్యమని మాకు అర్థమై.. దాన్ని గేమ్స్‌, యానిమేటెడ్‌ సిరీస్‌ ఇలా వివిధ రూపాల్లో బయటకు తీసుకురావాలని ప్రయత్నించాం. అయితే ఈ ప్రయాణంలో సరైన వ్యక్తులతో జత కట్టాలని మాకు అర్థమైంది. అప్పుడే శరద్‌ తన ఆలోచనని నాతో పంచుకున్నారు. యానిమేషన్‌లో ఆయన విజన్‌ నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత ఆయనతో చాలా కథా చర్చలు జరిగాయి. ఈ కథను ముందుకు తీసుకెళ్లమని శరద్‌కు చెప్పడానికి నా మనసుకు చాలా కష్టంగా అనిపించింది. నా ప్రమేయం లేకుండా బాహుబలి కథ చెప్పడమా అనిపించింది (నవ్వుతూ). కానీ, శరద్‌ ‘బాహుబలి’లోని పాత్రలపై నాకున్న ప్రేమను అర్థం చేసుకుని.. తన బృందంతో కలిసి చక్కగా ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’ కథను సిద్ధం చేసి తీసుకొచ్చాడు. అది నాకు బాగా నచ్చడంతో ఈ సిరీస్‌ మొదలైంది. ఇది ‘బాహుబలి’కి సీక్వెల్‌ లేదా ప్రీక్వెల్‌లా ఉండదు. ఆ రెండు భాగాలకు మధ్యలో జరిగే కథ ఇది. కచ్చితంగా అందరికీ నచ్చేలా ఉంటుంది. మేము రాబోయే రోజుల్లో ఈ బాహుబలి విశ్వాన్ని మరింత విస్తరింపజేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. దానికి ఈ యానిమేటెడ్‌ సిరీస్‌ ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో ఇది చాలా రకాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ వివరాల్ని త్వరలో వెల్లడిస్తా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో శరద్‌ కేల్కర్‌, శరద్‌ దేవరాజన్‌, గౌరవ్‌ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని