Jailer Movie Review: రివ్యూ: ‘జైలర్‌’.. రజనీకాంత్‌ కొత్త మూవీ ఎలా ఉందంటే?

Jailer Movie Review; రజనీకాంత్‌, మోహన్‌లాల్‌, జాకీష్రాఫ్‌ కీలక పాత్రల్లో నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ రూపొందించిన ‘జైలర్‌’ మూవీ ఎలా ఉందంటే?

Updated : 10 Aug 2023 15:44 IST

Jailer Movie Review; చిత్రం: జైలర్‌; నటీనటులు: రజనీకాంత్‌, మోహన్‌లాల్‌, జాకీ ష్రాఫ్‌, శివరాజ్‌కుమార్‌, సునీల్‌, రమ్యకృష్ణ, వినాయకన్‌, మిర్నా మేనన్‌, తమన్నా, యోగిబాబు తదితరులు; సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌; సినిమాటోగ్రఫీ: విజయ్‌ కార్తిక్‌ కణ్ణన్‌; ఎడిటింగ్‌: ఆర్‌.నిర్మల్‌; నిర్మాత: కళానిధి మారన్‌; రచన, దర్శకత్వం: నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌; విడుదల తేదీ: 10-08-2023

జనీకాంత్‌ (Rajinikanth) సినిమా వస్తుందంటే తమిళ ప్రేక్షకులే కాదు, తెలుగు వారూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక్కడ కూడా ఆయన సినిమాలకు మంచి మార్కెట్‌ ఉంది. రెండేళ్ల కిందట వచ్చిన ‘పెద్దన్న’ తర్వాత ఆయన నుంచి మరో సినిమా రాలేదు. అది కూడా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది. ఈ క్రమంలో కేవలం మూడు సినిమాలు మాత్రమే దర్శకత్వం వహించిన నెల్సన్‌ దిలీప్‌కుమార్‌కు అవకాశం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు రజనీ. ఇక ప్రచార చిత్రం చూసిన తర్వాత పాత రజనీని గుర్తు చేశారు. మరి ‘జైలర్‌’లో రజనీ పాత్ర ఏంటి? (Jailer movie review) ఆయన శత్రువులపై ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది? అభిమానులు ఆశించే అన్ని అంశాలను మేళవించి నెల్సన్‌ ఎలా ఈ మూవీని తెరకెక్కించారు?

దర్శకుడిని మార్చాలంటూ సలహా.. పట్టించుకోని రజనీ: ‘జైలర్‌’ సంగతులివీ!

కథేంటంటే: ముత్తు అలియాస్ ముత్తువేల్ పాండ్య‌న్ (ర‌జ‌నీకాంత్‌) ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. నీతి, నిజాయ‌తీగా ప‌నిచేసిన ఆయ‌న గురించి బాగా తెలిసిన‌వాళ్లు టైగ‌ర్ అంటుంటారు. త‌న  భార్య (ర‌మ్య‌కృష్ణ‌),  ఏసీపీగా ప‌నిచేస్తున్న త‌న‌యుడు అర్జున్‌, మ‌న‌వ‌డే లోకంగా జీవితం గ‌డుపుతుంటాడు. నేర‌స్తుల‌ ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తాడ‌నే పేరున్న అర్జున్ ప‌నితీరుని చూసి త‌నలాగే త‌న కొడుకు నీతి నిజాయ‌తీల‌తో ప‌నిచేస్తున్నాడ‌ని గ‌ర్వ‌ప‌డుతుంటాడు. ఇంత‌లోనే విగ్ర‌హాల దొంగ‌త‌నం ముఠా నాయ‌కుడైన వ‌ర్మ (వినాయ‌క‌న్‌) పని వల్ల ముత్తువేల్‌ కుటుంబానికి తీరని అన్యాయం జరుగుతుంది. ఆ విష‌యాన్ని పోలీసులు కూడా బ‌య‌ట పెట్ట‌లేని ప‌రిస్థితి. అంత‌టితో ఆగ‌కుండా ముత్తువేలు కుటుంబాన్ని కూడా అంతం చేయ‌డానికి సిద్ధ‌ప‌డ‌తాడు వ‌ర్మ‌. త‌న కుటుంబానికే అపాయం ఏర్ప‌డింద‌ని తెలుసుకున్న ముత్తు ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడు? (Jailer movie review in telugu) అతి క్రూర‌మైన మ‌న‌స్తత్వమున్న వ‌ర్మ‌ని ముత్తు ఏం చేశాడనేది తెర‌పైనే చూడాలి.

ఎలా ఉందంటే: మాఫియా, ప్ర‌తీకార నేప‌థ్యం, కుటుంబ అంశాల మేళ‌వింపుగా రూపొందిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి క‌థ ఇది. ర‌జ‌నీకాంత్ మార్క్ మాస్ స్టైల్‌,  హీరోయిజమే ప్ర‌ధానంగా సాగుతుంది. ఒక్క మాట‌లో ఆయ‌న వ‌న్‌ మ్యాన్‌ షో ఇది. ‘విక్ర‌మ్‌’ సినిమా త‌ర‌హాలో ఓ మాఫియా ముఠాని, దానికి నాయ‌కుడైన వ‌ర్మ క్రూర‌త్వాన్ని ప‌రిచ‌యం చేస్తూ ఆరంభ‌మ‌వుతుందీ చిత్రం. పాత్ర‌ల్ని ప‌రిచ‌యం చేయ‌డానికి స‌మ‌యం తీసుకున్న ద‌ర్శ‌కుడు..  ఆ త‌ర్వాత అస‌లు క‌థ‌ని మొద‌లుపెట్టాడు. తాత‌య్య ముత్తుగా, ఇంట్లో ప‌నులు చూసుకునే రిటైర్డ్ పోలీస్ అధికారిగా చాలా స‌హ‌జంగా ర‌జ‌నీకాంత్‌ని ప‌రిచ‌యం చేశాడు. కుటుంబం చుట్టూ స‌న్నివేశాల్ని మ‌లిచి వినోదం పంచాడు. ర‌జ‌నీకాంత్ - యోగిబాబుల మ‌ధ్య కామెడీ ట్రాక్ న‌వ్విస్తుంది. ప్ర‌థ‌మార్ధంలోని ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌ల్లో ఆ ట్రాక్ కీల‌కం. అర్జున్ మిస్సింగ్ త‌ర్వాతే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. (Jailer movie review in telugu) త‌న కొడుకు ఆచూకీ కోసం ముత్తువేలు పాండ్యన్‌ రంగంలోకి దిగాక ఎదుర‌య్యే ప‌రిణామాలు ఆస‌క్తిని రేకెత్తిస్తూ ప్రేక్ష‌కుడిని క‌థ‌లో లీనం చేస్తాయి. ఒక ప‌క్క తన‌యుడి మ‌ర‌ణానికి కార‌ణ‌మైనవాళ్ల‌ని అంతం చేస్తూనే... మ‌రోప‌క్క  కుటుంబాన్ని కాపాడుకునేందుకు చేసే ప్ర‌య‌త్నాలు ఆక‌ట్టుకుంటాయి. త‌న అస్త్రాల్ని సిద్ధం చేసుకోవ‌డం కోసం ర‌జ‌నీ చేసే ప్ర‌య‌త్నాలు.. విరామానికి ముందు వ‌చ్చే పోరాట ఘ‌ట్టాలు సినిమాకి మ‌రింత హైలైట్‌.

త‌న ఇంట్లోనే జ‌రిగే ఆ పోరాట ఘ‌ట్టాలు ర‌జనీలోని పూర్తి స్థాయి యాక్ష‌న్ కోణాన్ని ఆవిష్క‌రిచండంతోపాటు, ద్వితీయార్ధంపై మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. అనుకున్న‌ట్టుగానే సెకండాఫ్‌ మొద‌లైనా ఆ త‌ర్వాతే క‌థ అనూహ్యంగా  ప‌క్క‌దారి ప‌డుతుంది. విల‌న్ డిమాండ్‌కి త‌లొగ్గ‌డం, అత‌ని కోరిక మేర‌కు కిరీటం తీసుకొచ్చే స‌న్నివేశాలు నేల విడిచి సాము చేసిన‌ట్టుగా అనిపిస్తాయి. (Jailer movie review in telugu) ర‌జ‌నీ ఫ్లాష్‌బ్యాక్ స‌న్నివేశాలు కూడా అంత‌గా మెప్పించ‌వు. పైగా బ‌ల‌హీనంగా క‌నిపించే ర‌జ‌నీకి ఆ గెట‌ప్ అత‌క‌లేదు. అయితే ప్రీ క్లైమాక్స్‌కి ముందు వ‌చ్చే మ‌లుపు త‌ర్వాత మ‌ళ్లీ సినిమా గాడిన ప‌డుతుంది. శివరాజ్‌కుమార్‌, మోహ‌న్‌లాల్‌, జాకీష్రాఫ్‌ల అతిథి పాత్ర‌లు సినిమాకి ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ప్ర‌థ‌మార్ధంతో పోలిస్తే  ద్వితీయార్ధం అంతంత మాత్ర‌మే అనిపించినా... ర‌జ‌నీ త‌న‌దైన న‌ట‌న‌తో సినిమాని నిల‌బెట్టారు. అభిమానుల‌కైతే ఈ సినిమా మ‌రింత కిక్ ఇస్తుంది.

‘అర్థమైందా రాజా..’ 70 ఏళ్ల వయసులోనూ రజనీ మాటల తూటాలు..!

ఎవ‌రెలా చేశారంటే: అంతా తానై న‌డిపించాడు ర‌జ‌నీకాంత్‌ (Rajinikanth).  తాత‌య్యగా తెల్ల‌టి జుట్టు, గెడ్డంతోనే తెర‌పై క‌నిపించినా స‌రే... త‌న మార్క్ మాస్ అంశాలు ఎక్క‌డా త‌గ్గ‌కుండా చూసుకున్నారు. ఆయ‌న స్టైల్‌,  హీరోయిజం సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. తండ్రీ త‌న‌యుల క‌థ కావ‌డంతో ప‌తాక స‌న్నివేశాల్లో మంచి భావోద్వేగాల్ని కూడా పండించారు. న‌ర‌సింహ‌గా శివ రాజ్‌కుమార్‌, మాథ్యూగా మోహ‌న్‌లాల్ తెర‌పై చేసిన సంద‌డి సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. జాకీష్రాఫ్ పాత్ర కూడా చిన్న‌దే. ర‌మ్య‌కృష్ణ గృహిణిగా క‌నిపించారు. ఆమె పాత్ర‌కి అంత‌గా ప్రాధాన్యం లేదు. (Jailer movie review in telugu) వినాయ‌క‌న్ విల‌నిజం సినిమాకి హైలైట్‌. త‌న ముఖ క‌వ‌ళిక‌ల‌తోనే క్రూర‌త్వాన్ని పండించారు.  సునీల్‌, త‌మ‌న్నాల ట్రాక్ అక్క‌డ‌క్క‌డా న‌వ్విస్తుంది. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. అనిరుధ్ నేప‌థ్య  సంగీతం సినిమాకి జీవం పోసింది. కెమెరా, క‌ళ‌, ఎడిటింగ్ విభాగాలు చ‌క్క‌టి ప‌నితీరుని ప్ర‌ద‌ర్శించాయి. తెలిసిన  ప్ర‌తీకార క‌థ‌నే, ప‌లు  మ‌లుపుల‌తో ర‌జ‌నీ శైలికి త‌గ్గ‌ట్టుగా మ‌లిచిన నెల్స‌న్ ద‌ర్శ‌కుడిగా మంచి ప్ర‌తిభ‌ని ప్ర‌ద‌ర్శించారు. (Jailer movie review in telugu) ర‌జ‌నీ శైలి మాస్ అంశాల‌పైనే ఎక్కువ‌గా దృష్టిపెట్ట‌డంతో క‌థ, క‌థ‌నాల ప‌రంగా అక్క‌డ‌క్క‌డా లోటుపాట్లు క‌నిపిస్తాయి. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.

  • బ‌లాలు
  • + ర‌జ‌నీకాంత్
  • + ప్ర‌థ‌మార్ధం, సంగీతం
  •  + హాస్యం... విరామ స‌న్నివేశాలు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ద్వితీయార్థంలో కొన్ని స‌న్నివేశాలు
  • - తెలిసిన క‌థే
  • చివ‌రిగా..:  ‘జైల‌ర్’... మెప్పించాడు రాజా! (Jailer movie review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు