Jailer Movie: దర్శకుడిని మార్చాలంటూ సలహా.. పట్టించుకోని రజనీ: ‘జైలర్‌’ సంగతులివీ!

కోలీవుడ్‌ అగ్ర నటుడు రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘జైలర్‌’ ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా కొన్ని విశేషాలు..

Updated : 09 Aug 2023 12:03 IST

కోలీవుడ్‌ అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ (Rajinikanth) నటించిన తాజా చిత్రం ‘జైలర్‌’ (Jailer). నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రయాణాన్ని గమనిస్తే..

  • రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా 2021లో విడుదలైన ‘అన్నాత్తే’ (పెద్దన్న) (Annaatthe) ఆయన అభిమానులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. దాంతో, ‘రజనీ ఈసారి ఏ దర్శకుడితో పనిచేస్తారో’ అని అటు ఫ్యాన్స్‌, ఇటు ఆడియన్స్‌లో సందేహం ఉండేది. అప్పటికి మూడు సినిమాలే చేసి ఉన్న దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ (Nelson Dilipkumar)కు రజనీకాంత్‌ అవకాశం ఇచ్చి, సర్‌ప్రైజ్‌ చేశారు. #Thalaivar169 వర్కింగ్‌ టైటిల్‌తో గతేడాది ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని ప్రకటించారు. జూన్‌లో ‘జైలర్‌’ టైటిల్‌ని ఖరారు చేశారు. ఆగస్టులో చిత్రీకరణ ప్రారంభించారు.
  • నెల్సన్‌ తెరకెక్కించిన తొలి చిత్రం ‘కొలమావు కోకిల’ (నయనతార ప్రధాన పాత్రధారి) (Kolamaavu Kokila), శివ కార్తికేయన్‌ హీరోగా రూపొందించిన ‘వరుణ్‌ డాక్టర్‌’ (Doctor), విజయ్‌ కథానాయకుడిగా తెరకెక్కించిన ‘బీస్ట్‌’ (Beast).. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌ ప్రేక్షకుల్ని మెప్పించాయి. ‘బీస్ట్‌’కు మిశ్రమ స్పందన వచ్చిందని, దర్శకుడిని మారిస్తే బాగుంటుందని పలువురు డిస్ట్రిబ్యూటర్లు.. నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌, రజనీకాంత్‌కు సలహా ఇచ్చారట. సినిమాకు నెగెటివ్‌ టాక్‌ వచ్చినా నిర్మాతలకు నష్టాలు రాలేదని, మంచి దర్శకుడు ఎప్పటికీ ఫెయిల్‌ అవ్వడని రజనీకాంత్‌ ముందడుగేశారు.
  • ఈ సినిమాలో మలయాళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ (Mohanlal), కన్నడ ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్‌ (Shiva Rajkumar), బాలీవుడ్‌ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్‌ (Jackie Shroff) కీలక పాత్రలు పోషించడం విశేషం. వీరితోపాటు తమన్నా, రమ్యకృష్ణ, మిర్నా మేనన్‌, సునీల్‌, వసంత్‌ రవి, యోగిబాబు తదితరులు సందడి చేయనున్నారు. ముందుగా.. ఈ సినిమాలో కథానాయికగా ఐశ్వర్యరాయ్‌, కీలక పాత్రల్లో ప్రియాంక అరుళ్‌ మోహన్‌, హీరో శివ కార్తికేయన్‌ నటిస్తారని ప్రచారం జరిగింది.
  • ‘జైలర్‌’ సహా నెల్సన్‌ దర్శకత్వం వహించిన సినిమాలన్నింటికీ అనిరుధ్‌ (Anirudh Ravichander) సంగీతం అందించారు. ఇందులోని ‘నువు కావాలయ్యా’ (Va Nuvvu Kavalayya Song) పాట యూట్యూబ్‌లో 100 మిలియన్‌కిపైగా వ్యూస్‌ దక్కించుకుని రికార్డు సృష్టించింది. ఈ సినిమాకి ముందు రజనీకాంత్‌- అనిరుధ్‌ కాంబినేషన్‌లో ‘దర్బార్‌’, ‘పేట’ చిత్రాలొచ్చాయి.
  • రజనీకాంత్‌, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ‘నరసింహ’ సినిమా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అందులోని రమ్యకృష్ణ (Ramya Krishnan) నెగెటివ్‌ రోల్‌కు విశేష క్రేజ్‌ దక్కింది. సుమారు 24 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు కలిసి పనిచేసిన సినిమాకావడంతో ‘జైలర్‌’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. 1985లో తెరకెక్కిన ‘పడిక్కవదన్‌’లో రజనీకాంత్‌, రమ్యకృష్ణ తొలిసారి కలిసి నటించారు. రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన ‘బాబా’ చిత్రంలో రమ్యకృష్ణ అతిథిగా కనిపించారు.

  • ఈ చిత్రంలో రజనీకాంత్‌.. టైగర్‌ ముత్తువేల్‌ పాండియన్‌ (Tiger Muthuvel Pandian) పాత్రలో నటించారు. 2002లో విడుదలైన ‘బాబా’ సినిమా తర్వాత ‘పేట’ చిత్రంలోనే ‘సూపర్‌స్టార్‌ రజనీ’ అనే ఒరిజినల్‌ గ్రాఫిక్‌ టైటిల్‌ కార్డును ఉపయోగించారు. ‘జైలర్‌’లోనూ ఆ మ్యాజిక్‌ ఉండనుందని ట్రైలర్‌లో హింట్‌ ఇచ్చారు.
  • జైసల్మేర్‌,  మంగళూరు, హైదరాబాద్‌, చెన్నై తదితర ప్రాంతాల్లో షూటింగ్‌ జరిగింది. సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నిడివి 168 నిమిషాలని సమాచారం. ఈ చిత్రాన్ని ముందుగా ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావించినా సాధ్యంకాలేదు. దాంతో, మరో తేదీగా ఆగస్టు 10ని (jailer release date) ఎంపిక చేసుకున్నారు.
  • ఈ సినిమా ఆడియా విడుదల కార్యక్రమాన్ని చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించారు. దీనికి సంబంధించి 1000 ఎంట్రీ పాసులు అభిమానులకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. అందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరింది. అలా, రిజిస్ట్రేషన్‌ ఓపెన్‌ చేసిన 15 సెకన్లలోనే పాస్‌లన్నీ బుక్‌ అయ్యాయంటేనే రజనీకాంత్‌ క్రేజ్‌ తగ్గలేదని అర్థమవుతోంది.
  • రజనీకాంత్‌ సినిమాల విడుదల రోజు చెన్నైలోని కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించే విషయం తెలిసిందే. ‘జైలర్‌’ విషయంలోనూ ఆ ట్రెండ్‌ కొనసాగుతోంది. మధురై కేంద్రంగా నడిచే య్యూనో ఆక్వాకేర్‌ అనే కంపెనీ హాలీడేతోపాటు సినిమా టికెట్లను ఎంప్లాయిస్‌కు ఉచితంగా అందించింది.
  • ఇదే టైటిల్‌తో మలయాళ దర్శకుడు సక్కిర్‌ మడథిల్‌ ఓ సినిమా తెరకెక్కించడంతో ఇటీవల వివాదం నెలకొంది. ఆ టైటిల్‌ని తానే ముందుగా రిజిస్టర్‌ చేయించుకున్నానని, పేరు మార్చుకోవాలని సన్‌ పిక్చర్స్‌ని సంప్రదించినా ఫలితం శూన్యమని సక్కిర్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇల్లు, తన కుమార్తె నగలు తనఖా పెట్టి, కారు అమ్మేసి.. అధిక వడ్డీకి అప్పులు తీసుకువచ్చి ఈ చిత్రాన్ని నిర్మించానని, టైటిల్‌ క్లాష్‌ వల్ల ఒక్కోసారి తనకు సూసైడ్‌ చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తున్నాయని వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని