Updated : 03 Jul 2022 07:01 IST

Ritesh Rana: కలిసి నవ్వుకోవడంలో ఓ కిక్‌

పరిశ్రమకి కొత్తతరం దర్శకులొస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కొత్త రకమైన కథలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో భాగమే ‘మత్తు వదలరా’తో(Mathu Vadalara) పరిచయమైన దర్శకుడు...  రితేశ్‌ రాణా(Ritesh Rana). ఆయన తెరకెక్కించిన రెండో చిత్రమే ‘హ్యాపీ బర్త్‌డే’(Happy Birthday). లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) ప్రధాన పాత్ర పోషించారు. ప్రచార చిత్రాలతో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు రితేశ్‌ రాణా హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

పాన్‌ తెలుగు సినిమా అంటున్నారు. ఎందుకలా?
ప్రచారంలో భాగంగా పెట్టిన ఉపశీర్షిక అది. సరదాగా నవ్వుకోవడానికే ఆ ప్రయత్నం. ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని చెప్పడానికి సరదాగా పాన్‌ తెలుగు సినిమా అన్నాం.

పుట్టిన రోజు చుట్టూ తిరిగే కథ.. అనే ఆ  పేరు పెట్టారా?

లావణ్య త్రిపాఠి పాత్ర పేరు హ్యాపీ. ఆమె  పుట్టినరోజు కథలో కీలకమైన ఘట్టాలు జరుగుతాయి. అందుకే ఆ పేరు పెట్టాం. లావణ్య ఇలాంటి సినిమా చేయలేదు. ఆమె బయట చాలా సరదాగా ఉంటారు. ఒక టీవీ షోలో తనని చూసి ఈ పాత్ర రాశా. ఆమెకి ఈ పాత్ర కొత్తగా ఉండటంతో పాటు బాగా నప్పింది. మిగతా పాత్రలు చాలా బాగుంటాయి. నరేష్‌ అగస్త్య, వెన్నెల కిషోర్‌, సత్య... ఇలా చాలా మంది నటులున్నారు. మా అందరి మధ్య మంచి అవగాహన ఉంటుంది. దానికితోడు ఆ పాత్రలకి తగ్గ నటులు కావడంతోనే వాళ్లని ఎంపిక చేశాం. ఈ సాంకేతిక బృందంతో దాదాపు పదేళ్లుగా ప్రయాణం చేస్తున్నాం.

ఇంటింటికీ గన్‌ అంటున్నారు టీజర్‌లో. ఇంతకీ ఈ కథలో ఏం చెప్పారు?

ఒక ఊహాజనిత ప్రపంచంలో సాగే కామెడీ కథ ఇది. మనందరి దగ్గరా గన్‌ ఉండటం అనేది అసాధ్యం. గన్‌ పాలసీ, ఇంటింటికీ గన్‌ అంటూ అబద్ధపు ప్రపంచాన్ని సృష్టించాం. ఈ తరహా చిత్రాలకి సర్రియల్‌ కామెడీ జోనర్‌ అనే పేరుంది. కొత్త రకమైన ఈ తరహా చిత్రాలు తెలుగులో  ఇప్పటివరకూ రాలేదు. కథ లాజికల్‌గానే ఉంటుంది, ఆ కథ సాగే ప్రపంచమే మనకు కొత్తగా ఉంటుంది. ఈ జోనర్‌ విషయంలో సందేహాలు రాకూడదనే ప్రేక్షకులకు ప్రచార కార్యక్రమాల్లోనే వివరంగా చెప్పాం. ఈ కథ చాప్టర్లుగా సాగుతుంది. విజువల్‌ కామెడీ, వ్యంగ్యం, పేరడీ,... ఇలా కామెడీలో ఉన్న చాప్టర్లన్నిటినీ ఒకొక్కక్కటిగా స్పృశించాం. ఇలాంటి సినిమాలు థియేటర్‌లో ఆస్వాదించడానికి చాలా బాగుంటాయి. ఒక చోట వందల మంది కలిసి నవ్వుకోవడంలో ఓ కిక్‌ ఉంటుంది.

రకరకాల జోనర్లని ఎంచుకుంటూ చిత్రాలు చేస్తున్నారు. కొత్తదనం కోసమేనా?

నేనేం రాసినా అది కొత్తగా ఉండాలనుకుంటా. ‘మత్తు వదలరా’ పరిమిత వ్యయంతో నాకొక ఎంట్రీ కార్డ్‌లాగా ఉండాలని నన్నునేను నిరూపించుకునేందుకు చేశా. అది మంచి విజయం సాధించింది. ఈసారి ఓ కొత్త రకమైన సినిమానే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్నా. ఒక ప్రత్యేకమైన స్క్రీన్‌ప్లేతో దీన్ని తీర్చిదిద్దాం. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది.

తదుపరి ప్రాజెక్టుల విశేషాలేమిటి?

రెండు కథలు పక్కా అయ్యాయి. అవి కొత్త తరహావే. ఏది ముందుకు తీసుకెళ్లాలనేది ఇంకా ఖరారు కాలేదు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని