Aditi Shankar: ఏడాది సమయమిచ్చారు.. ఇండస్ట్రీ పేరెత్తకూడదన్నారు: అదితి శంకర్‌ జర్నీ

ప్రముఖ దర్శకుడు శంకర్‌ తనయ అదితి నటించిన ‘మహావీరుడు’ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా అదితి గురించి పలు ఆసక్తికర విశేషాలు మీకోసం..

Published : 13 Jul 2023 16:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర దర్శకుడు శంకర్‌ (Shankar) కూతురిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినా.. గాయని, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అదితి శంకర్‌ (Aditi Shankar). హీరో శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan) సరసన ఆమె నటించిన ‘మహావీరుడు’ (Mahaveerudu) సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

తొలి పాట ఇదే..

అదితి తల్లికి సంగీతమంటే చాలా ఇష్టం. ఖాళీ సమయంలో పాటలు పాడుతూ ఉంటారామె. తల్లిని అలా చూస్తూ పెరిగిన ఆమెకు సంగీతంపై ఆసక్తి కలిగింది. తాను పాడిన పాటలను ఫోన్‌లో రికార్డు చేసుకునేది. ఒకసారి అనుకోకుండా ఆ ట్రాక్‌లు విన్న సంగీత దర్శకుడు తమన్‌.. వరుణ్‌తేజ్‌ హీరోగా తెరకెక్కిన ‘గని’ సినిమాలో పాడే అవకాశమిచ్చారు. ఆ పాటే ‘రోమియోకి జూలియెట్‌లా..’. దీనికోసం తమన్‌ ప్రత్యేకంగా కవర్‌ సాంగ్‌ షూట్‌ చేసి ఆమెను ప్రేక్షకులకు పరిచయం చేశారు. అలా శంకర్‌ తనయ ప్రేక్షకులకు పరిచయమైంది.

షరతు పెట్టారు..

నాన్న దిగ్గజ దర్శకుడు. ఎందరో అగ్ర తారలతో సినిమా చేశాడు. అలా బాల్యం నుంచీ స్టార్‌లను, షూటింగ్‌లను చూడడంతో అదితి నటనపై మొగ్గుచూపింది. హీరోయిన్‌కావాలనే తన కోరికను బయటపెట్టకుండా నాన్న కోసం చదువుపై శ్రద్ధ పెట్టింది. ఎంబీబీఎస్‌లో చేరిన తర్వాత తన మనసులో మాటని తండ్రికి చెప్పింది. కూతురు ఆ మాట చెప్పగానే శంకర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు.

‘సినీ రంగంలో నిలదొక్కుకోవడం అంత తేలిక కాదు. నా పేరు వాడుకోకుండా అవకాశాల కోసం నువ్వే ప్రయత్నించు. అందుకు ఏడాది సమయం ఇస్తున్నా. ఈ లోపు అవకాశాలు వస్తే ఓకే. లేదంటే ఇండస్ట్రీ పేరెత్తకూడదు’ అని షరతు పెట్టారు. ఆ కండిషన్‌కు ‘ఎస్‌’ చెప్పిన అదితి వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది.

చదువుతూనే నటన..

అదితికి హీరోయిన్‌గా తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు ఎం. ముత్తయ్య. కార్తి హీరోగా ఆయన తెరకెక్కించిన ‘విరుమన్‌’ (Viruman) సినిమా కోసం ఆమెను సంప్రదించారు. శంకర్‌ అనుమతి పొందాకే అదితికి కథ వినిపించారు. మోడ్రన్‌గా ఉండే ఆమె పల్లెటూరి అమ్మాయి పాత్రకి నప్పుతుందో లేదోనని హీరో కార్తి (Karthi) సందేహించారట. స్క్రీన్‌ టెస్ట్‌లో మధురై యాసలో గలగలా మాట్లాడడంతో ఫిదా అయిన వారు ఆ పాత్రకి అదితిని ఎంపిక చేశారు. ఎంబీబీఎస్‌ చదువుతూనే ఈ సినిమాలో నటించిందామె. ‘మదుర వీరన్‌’ పాటనూ ఆలపించింది. తొలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని ‘మావీరన్‌’ (Maaveeran)లో అవకాశం దక్కించుకుంది. మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో ‘మహావీరుడు’ (Mahaveerudu On July 14th) పేరుతో విడుదలకానుంది. మరోవైపు, హీరో శింబు సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.

అలా తెలుగు నేర్చుకుంది..

శంకర్‌ తెరకెక్కించిన సినిమాల్లో ‘జెంటిల్‌మేన్‌’ (Gentleman) అంటే అదితికి బాగా ఇష్టం. శంకర్‌ దర్శకత్వం వహించిన సినిమాలన్నీ తెలుగులోనూ విడుదలవుతుంటాయనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తెలుగు నేర్చుకున్నారు. తండ్రితో మాట్లాడుతూ అదితి కూడా తెలుగు నేర్చుకుంది. టాలీవుడ్‌ సినిమాలు ఎక్కువగా చూస్తుంది. 

మహేశ్‌ బాబు తిరస్కరించారు..

అదితి ఫేవరెట్‌ నటుడు మహేశ్ బాబు (Mahesh Babu). ఓసారి ఆమె తన సోదరితో కలిసి ముంబయి వెళ్లింది. వాళ్లు బస చేసిన హోటల్‌లోనే మహేశ్‌ కూడా ఉన్నారు. సమాచారం తెలిసి ఆయన దగ్గరకు వెళ్లి ఆటోగ్రాఫ్‌/ఫొటో అడిగింది అదితి. ‘ఇది సందర్భం కాదమ్మా.. కుటుంబంతో ఉన్నా’ అని మహేశ్‌ సున్నితంగా తిరస్కరించారు. అయినా ఆమె బాధపడలేదు. ఆ తత్వం తనకెంతో నచ్చిందని చెబుతూ మంచి మనసు చాటుకుంది.

అయితే, తన దగ్గరకు వచ్చిన సమయంలో వాళ్లు శంకర్‌ కూతుళ్లని మహేశ్‌ బాబుకు తెలియదు. తర్వాత ఎవరో చెప్పడంతో వారి కోసం వెతికే ప్రయత్నం చేశారాయన. చివరకు వారి ఆచూకీ పట్టుకున్నారు. అదే సమయానికి అక్కడ శంకర్‌ ఉండడంతో జరిగిన విషయం చెప్పి, ఆయనకు సారీ చెప్పారట మహేశ్‌.

పేదలకు సేవ చేయాలని..

అదితి చెన్నైలో పుట్టి ,పెరిగింది. డాక్టర్‌ అయి పేదలకు సేవ చేయాలనేది ఆమె చిన్నప్పటి లక్ష్యం. ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. కష్టపడి చదివింది కాబట్టి ఆ వృత్తిని పూర్తిగా వదల్లేక ఖాళీ సమయాల్లో పేదల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని