Tollywood: ఖాకీ డ్రెస్‌ వేసిన కథానాయికలు.. ఎవరో తెలుసా?

తెరపై గ్లామర్‌ పాత్రలకే పరిమితం కాకుండా పవర్‌ఫుల్ పాత్రల్లోనూ కనిపిస్తున్నారు కథానాయికలు. ఇప్పటి వరకు పోలీస్‌ డ్రెస్‌లో కనిపించిన కొందరు హీరోయిన్లు ఎవరో చూద్దాం.

Updated : 13 Jul 2023 10:32 IST

సినిమాలో నటీనటులు ఎవరైనా పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారంటే సినీ ప్రియులంతా ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే స్టార్ హీరోలకు పోటీగా హీరోయిన్స్‌ కూడా ఖాకీ డ్రెస్‌ వేసి పోలీస్‌ పాత్రల్లో అదరగొడుతున్నారు. పాత్ర డిమాండ్‌ చేస్తే.. బికినీలు వేసుకున్న ఆ భామలే చేతిలో లాఠీ పట్టి ఔరా అనిపిస్తున్నారు. గ్లామర్‌ పాత్రలకే పరిమితం కాకుండా ఎలాంటి వాటిల్లోనైనా నటించగలమని నిరూపిస్తున్నారు. నాటి హీరోయిన్లు శారదా, సుహాసిని, విజయశాంతి (Vijayashanti), టబు  దగ్గర నుంచి నయనతార వరకు ఎంతో మంది అందాల భామలు పోలీసు పాత్రల్లో అదరగొట్టారు. బాలీవుడ్‌ బాద్‌ షా నటిస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘జవాన్‌’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్లో  నయనతార (Nayanthara) పోలీస్ అధికారి పాత్రలో స్టైలిష్‌గా కనిపించి ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు తెరపై ఖాకీ డ్రెస్‌లో కనిపించిన కొందరు కథానాయికలు ఎవరో చూద్దాం..

‘సత్యభామ’లో కాజల్‌..

ఇండస్ట్రీలో చందమామ అనగానే గుర్తొచ్చే పేరు కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). అందంగా హావభావాలు పలికిస్తూ అందరికీ ఆకట్టుకున్న కాజల్.. ‘సత్యభామ’ సినిమాలో శక్తిమంతమైన పోలీస్‌ అధికారి పాత్రలో నటించనుంది. ఇటీవల ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్‌లో పవర్‌ఫుల్ డైలాగుతో ఆకట్టుకుంది. అఖిల్‌ డేగల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

‘జవాన్‌’లో నయనతార..

అగ్ర కథానాయికల్లో ఒకరైన నయనతార ఎన్నో సినిమాల్లో గ్లామర్‌ పాత్రల్లో నటించి అలరించింది. తాజాగా అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్‌ స్టార్ హీరో షారుక్‌ ఖాన్ నటిస్తోన్న  ‘జవాన్‌’ (Jawan)లో పవర్‌ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించింది. ట్రైలర్‌తోనే సంచలనం సృష్టించిన ఈ మూవీ సెప్టెంబర్‌ 7న విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

‘శాకిని డాకిని’లో రెజీనా, నివేదా థామ‌స్‌..

కొరియా చిత్రం ‘మిడ్‌నైట్ ర‌న్న‌ర్స్‌’కి రీమేక్‌గా రూపొందిన ‘శాకిని డాకిని’లో ఇద్దరు టాలీవుడ్ ముద్దు గుమ్మలు పోలీసు పాత్రల్లో కనిపించారు. రెజీనా (Regina Cassandra), నివేదా థామ‌స్‌లు (Nivetha Thomas) పాత్రల్లో ఒదిగిపోయి అలరించారు.  నేరాన్ని ఛేదించేందుకు సాగించే ప‌రిశోధ‌నాత్మ‌క స‌న్నివేశాల్లోనూ ఇద్ద‌రూ చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. యాక్ష‌న్ స‌న్నివేశాల్లోనూ అదరగొట్టి అందరి నుంచి ప్రశంసలు అందుకున్నారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుని హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. 

‘ఝాన్సీ’లో జ్యోతిక..

ఎలాంటి పాత్రనైనా అలవోకగా చేయగల నటుల్లో జ్యోతిక (Jyotika) ఒకరు. ‘చంద్రముఖి’ లాంటి హారర్‌ సినిమాలో భయపెట్టిన జ్యోతిక.. ఈ మధ్య తెలుగులో విడుదలైన ఝాన్సీ సినిమాలో సిన్సియర్‌ పోలీస్ ఆఫీసర్‌గా నటించింది. ఈ చిత్రం తొలుత తమిళంలో విడుదల కాగా.. ప్రేక్షకాదరణ పొందడటంతో తెలుగు, హిందీలో డబ్ చేశారు.

‘సుప్రీమ్‌’లో రాశీ ఖన్నా..

బబ్లీ గార్ల్‌ రాశీ ఖన్నా (Raashi Khanna) గ్లామర్‌ పాత్రల్లో నటించడమే కాదు ఓ సినిమాలో పోలీస్‌గానూ అలరించింది. సాయి ధరమ్‌ తేజ్‌ కెరీర్ తొలినాళ్లలో వచ్చిన సుప్రీమ్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీదేవిగా నటించింది. పోలీస్ డ్రెస్‌లో రాశీఖన్నాను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎంతోమంది ఆమె ఫొటోను ఫోన్లలో వాల్‌పేపర్‌గా కూడా పెట్టుకున్నారు. 

‘క్షణం’లో అనసూయ..

యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాలతో అలరిస్తోంది. ఎలాంటి పాత్రలతోనైనా ప్రేక్షకులను ఆకట్టుకోగల అనసూయ ఓ సినిమాలో పోలీస్‌ పాత్రలో కనిపించింది. అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘క్షణం’లో ఈ యాంకరమ్మ (Anasuya Bharadwaj) ఏసీపీగా కనిపించింది. విలన్‌ పాత్ర అయినప్పటికీ పోలీస్‌ డ్రెస్‌లో కనిపించి యాక్షన్ సన్నివేశాల్లో ఔరా అనిపించింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

వీళ్లే కాకుండా ఇంకా ఎంతోమంది సీనియర్‌ హీరోయిన్లు తెరపై పోలీసులుగా కనిపించారు. వెండితెర జేజమ్మ అనుష్క కూడా ఓ సినిమాలో అతిథిపాత్రలో ఖాకీ డ్రెస్‌లో కనిపించింది. అలాగే హీరోయిన్ శ్రుతిహాసన్‌ కూడా ఓ పాటలో పోలీస్ డ్రెస్‌ వేసి డ్యాన్స్‌తో అదరగొట్టింది. అలాగే తమన్నా, కీర్తి సురేశ్‌, అమలాపాల్, పాయల్ రాజ్‌పుత్, నమిత, ప్రియాంక చోప్రా ఇలా చాలామంది హీరోయిన్లు పోలీసులుగా కనిపించి ప్రేక్షకులను అలరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని