Atlee: అట్లీ.. అన్నీ హిట్లే.. అక్కడా.. ఇక్కడా..

‘జవాన్‌’తో మరో హిట్‌ అందుకున్న కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

Updated : 17 Oct 2023 13:02 IST

గురువారం విడుదలైన ‘జవాన్‌’ (Jawan) సినిమా హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. హీరో షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)తోపాటు డైరెక్టర్‌ అట్లీ (Atlee) పేరు మార్మోగుతోంది. దాంతో, అట్లీ గురించి తెలుసుకునేందుకు బాలీవుడ్‌ ప్రేక్షకులతోపాటు ఇక్కడి వారు కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. మరి, తొలి సినిమా నుంచి విజయపరంపర కొనసాగిస్తున్న అతి కొద్దిమంది దర్శకుల్లో ఒకరైన అట్లీపై ప్రత్యేక కథనం..

అలా మొదలై...

1986 సెప్టెంబరు 21న తమిళనాడులోని ఓ గ్రామంలో జన్మించిన అట్లీ అసలు పేరు అరుణ్‌ కుమార్‌. ప్రముఖ దర్శకుడు శంకర్‌ దగ్గర ‘ఎంథిరన్‌’ (రోబో), ‘నన్‌బన్‌’ (స్నేహితుడు) సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. 2011లో ‘ముగపుతగమ్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌కు దర్శకత్వం వహించగా అట్లీకి ప్రశంసలు దక్కాయి. ఆ లఘుచిత్రం ఇచ్చిన ధైర్యంతో మరో అడుగు ముందుకేసి ఓ సినిమాకి శ్రీకారం చుట్టాలనుకున్నారు అట్లీ. ఆ క్రమంలో రాసుకున్న రొమాంటిక్‌ కామెడీ డ్రామా స్టోరీనే ‘రాజా రాణి’ (Raja Rani). ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌తోపాటు ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌ నిర్మాణంలో భాగస్వామికావడం విశేషం. 2013లో ఈ సినిమా తెలుగులోనూ అదే పేరుతో విడుదలై విజయాన్ని అందుకుంది. సుమారు రూ. 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా దాదాపు రూ. 84 కోట్ల వసూళ్లు చేసింది. ఆర్య, జై, నయనతార, నజ్రియా ప్రధాన పాత్రలు పోషించి, యువతలో క్రేజ్‌ దక్కించుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా అట్లీ కోలీవుడ్‌కు చెందిన ‘విజయ్’ అవార్డు అందుకున్నారు.

రివ్యూ: జవాన్‌.. షారుక్‌, నయనతార యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

విజయ్‌తో హ్యాట్రిక్‌

‘రాజా రాణి’ తర్వాత అట్లీ.. విజయ్‌ (Vijay)తో వరుసగా మూడు చిత్రాలు తెరకెక్కించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన ‘తెరి’ (Theri) 2016 ఏప్రిల్‌లో విడుదలైంది. తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో డబ్ అయి ఇక్కడా అలరించింది. రూ. 75 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 150 కోట్లు కలెక్ట్‌ చేసింది. ఇందులో హీరోయిన్లు సమంత, అమీ జాక్సన్‌ మెరిశారు. ఉత్తమ దర్శకుడిగా అట్లీ ‘సైమా’ పురస్కారం అందుకున్నారు. విజయ్‌- అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన మరో యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘మెర్సల్‌’ (2017) (Mersal). నిత్యా మేనన్‌, కాజల్‌ అగర్వాల్‌, సమంత, ఎస్‌. జె. సూర్య కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా తెలుగులో పేరుకు తగ్గట్లు ‘అదిరింది’ అని అనిపించుకుంది. ఈ చిత్ర బడ్జెట్‌ రూ. 120 కోట్లు; వసూళ్లు: రూ. 200 కోట్లకుపైగానే. ఈ చిత్రానికీ బెస్ట్‌ డైరెక్టర్‌గా ‘సైమా’ అవార్డు అందుకున్నారు అట్లీ. ఆ తర్వాత ఆయన జానర్‌ మార్చారు. స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామాని ఎంచుకుని విజయ్‌తో మరో విజయం సాధించారు. ఆ సినిమానే 2019లో వచ్చిన ‘బిగిల్‌’ (Bigil). నయనతార కథానాయిక. ఈ సినిమా తెలుగులో ‘విజిల్‌’ పేరుతో విడుదలైంది. రూ. 180 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ. 280 కోట్లకుపైగా వసూళ్లు చేసింది.

ఐదో సినిమా ఇలా..

నాలుగు సినిమాల అనుభవంతోనే బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ని డైరెక్ట్‌ చేసే అవకాశం అందుకుని, అందరినీ ఆశ్చర్యపరిచారు అట్లీ. ఈ కాంబోలో సినిమా ప్రకటన వెలువడమే ఆలస్యం అంతటా ఆసక్తి నెలకొంది. తన సుదీర్ఘ ప్రస్థానంలో షారుక్‌ సౌత్‌ ఇండస్ట్రీ డైరెక్టర్లతో పనిచేయడం చాలా తక్కువ. మణిరత్నం (దిల్‌ సే), కమల్‌ హాసన్‌ (హే రామ్‌) తర్వాత ఆ అవకాశం అట్లీకి దక్కడంతో.. అదిరిపోయే కథ అయి ఉంటుందని అంతా భావించారు. ఇలాంటి ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబరు 7న విడుదలైన ‘జవాన్‌’ అట్లీని మరోస్థాయికి తీసుకెళ్లేలా చేస్తుందనడంలో సందేహం లేదు. ‘షారుక్‌ని పలు వైవిధ్య గెటప్పుల్లో మరే దర్శకుడూ చూపించలేదు’ అంటూ ఫ్యాన్స్‌ నెట్టింట ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే (అడ్వాన్స్‌ బుక్సింగ్స్‌లో) సరికొత్త రికార్డు సృష్టించింది. హిందీ, తమిళం, తెలుగులో విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది.

అప్పుడు కలవలేకపోయి..

కెరీర్‌ ప్రారంభంలో అట్లీ ఓసారి ముంబయి వెళ్లి షారుక్‌ను కలవాలనుకున్నారట. ఎంత ప్రయత్నించినా సాధ్యంకాకపోవడంతో షారుక్‌ ఇంటి ముందు ఫొటో దిగి తిరుగు పయనమయ్యారట. ఈ విషయాన్ని ‘జవాన్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో గుర్తుచేసుకుంటూ.. ‘‘అప్పట్లో షారుక్‌ సర్‌ని కలవలేకపోయా. కానీ, ‘జవాన్‌’ సినిమా కథ వినిపించేందుకు కారులో ఆయన ఇంటికి వెళ్లా. ఆ క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేను’’ అని అన్నారు.

మరికొన్ని విశేషాలు..

అట్లీ ప్రతి సినిమాలోనూ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్లు ఉంటాయి. అదే ఆయన్ను ప్రత్యేకంగా నిలుపుతుంది. విజయ్‌ మాత్రమే కాదు అట్లీ తెరకెక్కించిన వాటిలో నయనతార మూడు సినిమాల్లో కనిపించారు. నటులు యోగిబాబు, సాయి ధీనా, ఎడిటర్‌ రూబెన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ టి. ముత్తురాజ్‌ అట్లీ సినిమాలన్నింటికీ పనిచేశారు. ‘అంధకారం’లాంటి చిత్రాలతో మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా అట్లీ పేరొందారు. ‘నన్‌బన్‌’, ‘బిగిల్‌’లోని పాటల్లో, ‘జవాన్‌’లో ఓ సీన్‌లో ఆయన తెరపై సందడి చేశారు. నటి కృష్ణ ప్రియను ప్రేమ వివాహం చేసుకున్న అట్లీ.. తమ బాబుతో ఆడుకునేందుకు 4 నెలలు విరామం తీసుకోనున్నారు. ఆ తర్వాత తదుపరి చిత్రంపై ఫోకస్‌ పెట్టనున్నారు. మరోసారి విజయ్‌తో సినిమా చేస్తారంటూ ఇప్పటికే రూమర్లురాగా టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun)కు కథ చెప్పినట్లు అట్లీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరి, వరుసగా 5 విజయాలు నమోదు చేసిన అట్టీ 6వ చిత్రాన్ని ఎవరితో తెరకెక్కిస్తారన్నది ఇప్పుడు మరో ఆసక్తికర ప్రశ్న.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని