Janhvi Kapoor: నటి జీవితం.. సౌకర్యంగా ఉండదని అమ్మ చెప్పింది: జాన్వికపూర్‌

‘సినీతార జీవితం అనుకున్నంత సౌకర్యవంతంగా ఉండదు. ఈ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వొద్దు అని మా అమ్మ శ్రీదేవి(Sridevi) ఓసారి నాతో చెప్పారు’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటి జాన్వికపూర్‌ (Janhvi Kapoor). ‘గుడ్‌లక్‌ జెర్రీ’తో...

Published : 09 Aug 2022 01:35 IST

సినీ రంగంలోకి వస్తానంటే ఆమె ఒప్పుకోలేదు

ముంబయి: ‘‘సినీతారల జీవితం అనుకున్నంత సౌకర్యవంతంగా ఉండదు. ఈ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వొద్దు అని మా అమ్మ శ్రీదేవి(Sridevi) ఓసారి నాతో చెప్పారు’’ అని నటి జాన్వికపూర్‌ (Janhvi Kapoor) అన్నారు. ‘గుడ్‌లక్‌ జెర్రీ’తో (Goodluck Jerry) నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన తల్లిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ప్రతి క్షణం అమ్మని ఎంతగానో మిస్‌ అవుతున్నా. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేపేది. ఆమె ముఖాన్ని చూడకుండా నా రోజువారీ పనులు మొదలుపెట్టేదాన్ని కాదు. అలాంటిది ఇప్పుడు ఆమె లేకుండా జీవితాన్ని కొనసాగించడం ఎంతో కష్టంగా అనిపిస్తుంది’’ అని జాన్వి అన్నారు.

‘‘ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇస్తానన్నప్పుడు మీ అమ్మ ఏం అన్నారు?’’ అని ప్రశ్నించగా.. ‘‘మొదట్లో అమ్మ ఒప్పుకోలేదు. సినీ పరిశ్రమలోకి మాత్రం అడుగుపెట్టొద్దు అని చెప్పింది. ‘నా జీవితం మొత్తం పరిశ్రమలోనే గడిచిపోయింది. ఎన్నో ఏళ్లు కష్టపడి మీకిప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చాను. మీరు అనుకున్నట్లు స్టార్‌ జీవితం అంత సౌకర్యవంతంగా ఉండదు. అలాంటి రంగంలోకి నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏముంది?’ అని ఆమె ప్రశ్నించింది. కానీ నేను దానికి ఒప్పుకోలేదు. ఏది ఏమైనా నేను నటిగా కొనసాగాలి అనుకుంటున్నా అంటూ నా ఇష్టాన్ని తెలియచేయడంతో ఆమె ఓకే చెప్పింది. నా ఇష్టానికి అంగీకారం తెలిపినప్పటికీ.. ‘నువ్వు సున్నిత మనస్కురాలివి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక కొంతమంది వ్యాఖ్యలకు నొచ్చుకోక తప్పదు. ఇక్కడ నెగ్గుకు రావాలంటే మరింత కఠినంగా మారాల్సి ఉంటుంది. అది నాకిష్టం లేదు. నీ ప్రతి చిత్రాన్ని నా 300 సినిమాలతో పోల్చి చూస్తారు. అలాంటివి నువ్వు ఎలా తట్టుకోగలవు?’ అని అమ్మ ఎప్పుడూ కంగారుపడుతుండేది’’ అంటూ ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు జాన్వి. కోలీవుడ్‌లో సూపర్‌హిట్‌ సొంతం చేసుకున్న ‘కోలమావు కోకిల’ చిత్రానికి రీమేక్‌గా సిద్ధమైంది ‘గుడ్‌లక్‌ జెర్రీ’. తమిళంలో నయనతార పోషించిన పాత్రను హిందీలో జాన్వి నటించారు. సిద్ధార్థ్‌ సేన్‌గుప్త దర్శకుడు. డిస్నీ+హాట్‌ స్టార్‌ వేదికగా ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని