Evaru Meelo Koteeswarulu: ఎన్టీఆర్‌తో రామ్‌ చరణ్‌ చెప్పిన సంగతులివే..!

ఎన్టీఆర్‌ ప్రశ్నలకు రామ్‌ చరణ్‌ సమాధానం చెబితే ఎలా ఉంటుంది? అసలు ఈ ఇద్దరి మధ్య సంభాషణ ఎలా సాగుతుంది? దాన్నే చూపించింది ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ కార్యక్రమం. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ప్రసారమవుతున్న ఈ షోకి రామ్‌ చరణ్‌ గెస్ట్‌గా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ అడిగిన ప్రశ్నలకి రామ్‌ చరణ్‌ సమాధానం ఇచ్చారు. కొన్ని ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. ఆ విశేషాలివీ...

Published : 23 Aug 2021 01:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్టీఆర్‌ ప్రశ్నలకు రామ్‌చరణ్‌ సమాధానం చెబితే ఎలా ఉంటుంది? అసలు ఈ ఇద్దరి మధ్య సంభాషణ ఎలా సాగుతుంది? దాన్నే చూపించింది ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ప్రసారమవుతున్న ఈ షోకు రామ్‌చరణ్‌ గెస్ట్‌గా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ అడిగిన ప్రశ్నలకు రామ్‌చరణ్‌ సమాధానం ఇవ్వడంతో పాటు మరికొన్ని ఆసక్తికర సంగతుల్ని పంచుకున్నారు. ఆ విశేషాలివీ...

కాజ‌ల్ పేరుతో ఇబ్బంది ప‌డ్డా..

‘‘కుక్క‌లు పెంచుకోవ‌డమంటే నాకెంతో ఇష్టం. ప్ర‌స్తుతం నా దగ్గ‌ర 6 కుక్క‌లు ఉన్నాయి. వాటితోపాటు గుర్రాల‌ను పెంచుకోవ‌డం కూడా ఇష్ట‌మే. నా దగ్గ‌ర ఉన్న గుర్రాల‌లో ఒక‌ దాని పేరు బాద్ షా. ‘మ‌గ‌ధీర‌’లో అది మీ అందరికీ క‌నిపిస్తుంది. అదే సినిమాలో మ‌రో గుర్రాన్నీ చూపించారు. దాని పేరు కాజ‌ల్‌. నా స్నేహితుడు చ‌నిపోయే ముందు ఆ గుర్రాన్ని నాకు ఇచ్చాడు. అది నాకు ఎంతో స్పెష‌ల్‌. దాని క‌ళ్లు చాలా న‌ల్ల‌గా, షార్ప్‌గా ఉంటాయి. అందుకే దాని పేరు కాజ‌ల్‌. ‘మ‌గ‌ధీర’ కంటే ముందే అది నా దగ్గరకు వ‌చ్చింది. అయితే మ‌గ‌ధీర విడుద‌ల‌య్యాక హీరోయిన్ పేరు కూడా కాజ‌లే కావ‌డంతో నాకు కొంచెం ఇబ్బంది అయ్యింది. (న‌వ్వులు)’’ అంటూ చెప్పుకొచ్చారు రామ్‌చరణ్‌.

ఆయన బాబాయ్‌.. సోదరుడు..

‘‘జీవితంలో కొన్ని బంధాల గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా అది త‌క్కువే అవుతుంది. కొందరితో ఉన్న అనుబంధాన్ని బ‌య‌ట పెట్ట‌క‌పోవ‌డ‌మే మంచిది. ఆ అనుబంధాల‌ను బ‌య‌ట‌పెడితే దిష్టి త‌గులుతుందేమోన‌ని నేను న‌మ్ముతాను. అలాంటి అనుబంధ‌మే నాకు పవన్‌ బాబాయ్‌కు మధ్య ఉంది. అందుకే మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్‌ గురించి నేనే బయట ఎక్కువగా మాట్లాడను. నా చిన్న‌ప్ప‌టి నుంచి ఆయ‌న‌తో నాకు ఉన్న రిలేష‌న్ మాట‌ల్లో చెప్ప‌లేనిది. నాన్న షూటింగ్స్ లో బిజీగా ఉంటే అమ్మ కూడా ఆయ‌న‌తో పాటు లొకేష‌న్‌కి వెళ్లేది. దాంతో బాబాయే మా ముగ్గుర్ని ద‌గ్గరుండి జాగ్ర‌త్త‌గా చూసుకునేవారు. ట్యూష‌న్స్‌లో స‌రిగ్గా చ‌దువుకోక‌పోతే మ‌మ్మ‌ల్ని మంద‌లించేవారు. మేం పెద్ద‌య్యాకా నాన్న నాతో డైరెక్ట్‌గా చెప్ప‌లేని ఎన్నో విష‌యాల‌ను బాబాయ్ ద్వారా మాకు చెప్పించేవారు. ఆయ‌న నాకో సోద‌రుడు, బాబాయ్‌, చిన్న తండ్రి’’ అంటూ పవన్‌తో అనుబంధాన్ని వివరించారు.

నేను ఎక్కువ‌గా అదే చూస్తా

‘‘తార‌క్.. నువ్వు గురువు గారు.. గురువు గారు అంటున్న‌ప్పుడ‌ల్లా నువ్వు న‌టించిన ‘అదుర్స్’ సినిమా గుర్తుకు వ‌స్తోంది. ఆ సినిమా నాకెంతో న‌చ్చింది. నేను ఎన్నోసార్లు చూశాను. బాగా న‌వ్వుకున్నాను. అందులో నీ కామెడీ టైమింగ్‌, పంచ్‌లు అదుర్స్ అనిపించేలా ఉంటాయి. ఇప్ప‌టికీ నాకు ఎప్పుడైనా డ‌ల్‌గా అనిపిస్తే వెంట‌నే ‘అదుర్స్’ చూస్తా’’

ఆచార్య.. స్కూల్ ప్రిన్సిప‌ల్‌తో ఉన్న‌ట్లు
‘‘సాధార‌ణంగానే నాన్న సినిమా షూటింగ్స్‌కి వెళ్లిన‌ప్పుడు నేను ఫుల్ టెన్ష‌న్ ప‌డ‌తాను. అలాంటిది ఆయ‌న‌తో ‘ఆచార్య’ చేస్తున్న‌ప్పుడు చాలా కంగారుగా అనిపించింది. సెట్‌లో ఆయ‌న్ను చూసిన‌ప్పుడు స్కూల్లో ప్రిన్సిప‌ల్‌తో ఉన్న‌ట్లు అనిపించింది. నా జీవితంలోనే కాకుండా నా కుటుంబం మొత్తానికీ ‘ఆచార్య’ ఎంతో స్పెష‌ల్‌. నాన్న‌తో క‌లిసి స్క్రీన్ పంచుకోవ‌డాన్ని జీవితంలో ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. ఇలాంటి ఒక గొప్ప అవ‌కాశాన్ని నాకు క‌ల్పించిన మా డైరెక్ట‌ర్‌.. నీ డైరెక్ట‌ర్‌.. మ‌న డైరెక్టర్ కొర‌టాల‌ శివ‌కు పెద్ద థ్యాంక్స్‌. కేవ‌లం 15 నిమిషాల పాత్ర‌గా ప్రారంభ‌మైన సిద్ధ పాత్ర.. సుమారు ఓ ఫుల్ లెంగ్త్ పాత్ర‌గా ఆయ‌న తీర్చిదిద్దారు’’ అని రామ్‌ చరణ్‌ వివరించారు.

మేజిక్ చూడ్డానికి సిద్ధంగా ఉండండి

‘‘కొమురం భీమ్ పాత్ర‌లో మీకు ఎన్నో ఆశ్చ‌ర్య‌ప‌రిచే విష‌యాలు ఉంటాయి. స్క్రీన్‌పై తార‌క్‌ని చూసి మీ అందరూ ఫిదా అయిపోతారు. ఆ మేజిక్‌ని నేను ఇప్పుడు చెప్ప‌ను. త్వ‌ర‌లో త‌ప్ప‌కుండా మీ అంద‌రూ వెండితెర‌పై చూస్తారు’’ అంటూ ఎన్టీఆర్‌ పాత్రపై ఆసక్తిని రెట్టింపు చేశారు రామ్‌ చరణ్‌.

పూర్వ‌జ‌న్మ‌ సుకృతం -తార‌క్‌

‘‘కొమురం భీమ్ పాత్ర‌లో న‌టించ‌డం నాకెంతో ఆనందంగా ఉంది. ఆ సినిమా షూట్‌లో మ‌నం ఎంతో క‌ష్టప‌డ్డాం. అల్లూరి సీతారామ‌రాజుగా నువ్వు.. కొమురంభీమ్‌గా నేను ఎంత క‌ష్ట‌ప‌డ్డామో తెలుసుగా. అలాంటి గొప్ప పాత్రల్లో మ‌నం న‌టించామంటే నిజంగా మ‌న పూర్వజ‌న్మసుకృతం’’ అంటూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విశేషాలను పంచుకున్నారు ఎన్టీఆర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని