MaheshBabu: మా సినిమా మరో బాహుబలి కాదు..!

దర్శకధీరుడు రాజమౌళి-సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుల కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఆఫ్రికా అడవుల బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఈ సినిమా రానుంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి.....

Published : 09 Aug 2021 18:10 IST

రాజమౌళితో ప్రాజెక్ట్‌పై సూపర్‌స్టార్‌ ఏమన్నారంటే

హైదరాబాద్‌: దర్శకధీరుడు రాజమౌళి-సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుల కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఆఫ్రికా అడవుల బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఈ సినిమా రానుంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో జక్కన్నతో కలిసి పనిచేయడం గురించి మహేశ్‌ స్పందించారు. ‘మా ఇద్దరి కాంబినేషన్‌లో ప్రాజెక్ట్‌ వస్తే చూడాలని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మా సినిమా పట్టాలెక్కడానికి ఇంకా సమయం ఉంది. కాబట్టి ఇప్పుడే దాని గురించి ఏం బయటపెట్టలేను. ఈ సినిమా నాకెంతో స్పెషల్‌. ఇది మరో ‘బాహుబలి’ మాత్రం కాదు’ అని ఆయన అన్నారు.

‘సర్కారు వారి’ పాట రిలీజ్‌ గురించి ఆయన స్పందిస్తూ.. ‘ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 13న థియేటర్లలోనే విడుదల చేయనున్నాం. ఆ విషయంలో నేనెంతో నమ్మకంగా ఉన్నాను. ఓటీటీ మీద నాకు గౌరవం ఉంది. అది వేరే తరహా మాధ్యమం. వెండితెర కోసమే నా సినిమాలు సిద్ధమవుతున్నాయి. అలాగే, థియేటర్ల వేదికగా నా ఫ్యాన్స్‌ని నేను కలవగలను’ అని మహేశ్‌ వివరించారు. కరోనా వల్ల వచ్చిన బ్రేక్‌తో తన తండ్రి, భార్యాపిల్లలతో ఎక్కువగా సమయం గడపడానికి అవకాశం లభించిందని ఆయన తెలిపారు. ఇప్పుడిప్పుడే షూటింగ్స్‌ తిరిగి ప్రారంభమవుతున్నాయని.. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సెట్‌లోకి అడుగుపెడుతున్నామని వివరించారు. కరోనా వేళ అధికారుల సూచనలు తప్పకుండా అందరూ పాటించాలని మహేశ్‌ కోరారు.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేశ్‌ ‘సర్కారువారి పాట’ సినిమాలో నటిస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేశ్‌ యంగ్‌ లుక్‌లో మరింత ఎనర్జిటిక్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో ఓ సినిమా పట్టాలెక్కించనున్నారు. అనంతరం రాజమౌళితో భారీ ప్రాజెక్ట్‌ చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని