Trisha: సొంత ఇంటికి వచ్చినట్లు అనిపించింది!

‘ మౌనమ్‌ పెసియాదే’ అనే తమిళ చిత్రంతో కథానాయికగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, ‘వర్షం’ విజయంతో తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా ఎదిగింది త్రిష.

Updated : 12 Nov 2023 12:22 IST

‘ మౌనమ్‌ పెసియాదే’ అనే తమిళ చిత్రంతో కథానాయికగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, ‘వర్షం’ విజయంతో తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా ఎదిగింది త్రిష. ‘నువ్వొస్తానంటే..నేనొద్దంటానా’తో అభిమానులకు వద్దనకుండానే మంచి ట్రీట్‌ అందించింది. వరస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె ఇమేజ్‌ను మాత్రం ఈ ఏడాదిలో విడుదలైన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమాలు పూర్తిగా మార్చేశాయి. ఆ సినిమా తర్వాత స్టార్‌ హీరోలకు జోడీగా మారి మరోసారి తన క్రేజ్‌ను నిరూపించుకుంది. ఇటీవల విడుదలై విజయాన్ని సొంతం చేసుకున్న ‘లియో’లో విజయ్‌కి జోడీగా నటించి మెప్పించింది త్రిష. 15 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలిసి  నటించిన చిత్రమిది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ‘లియో’ సినిమా అనుభవాల్ని పంచుకుంది.

కే వ్యక్తితో నాలుగు సినిమాలు చేసి...15ఏళ్ల తర్వాత తిరిగి అదే వ్యక్తితో కలసి మరో సినిమా చేస్తున్నామంటే తనతో ఉండే మంచి అనుబంధమే దానికి కారణం. అలాంటి కంఫర్ట్‌ నాకు విజయ్‌తో ఉంటుంది. ‘మీ ఇద్దరినీ తెరపై మళ్లీ ఎప్పుడూ చూస్తాం’ అని కొంత కాలంగా అడిగేవారు. ఈ సినిమాతో వారి కల నెరవేరినందుకు నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత తిరిగి మేమిద్దరం నటిస్తున్న ఈ సినిమాపై వారికి మంచి హైప్‌ ఉంటుంది.

  • మేము ఇంతకముందు చేసిన సినిమాలు ఎంత ఆహ్లాదకరంగా ఉండేవో మా ఇద్దరి మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ, విదేశాలలో చిత్రీకరించిన పాటలు చూస్తే తెలుస్తోంది. అప్పట్లో సినిమాలు చాలా భిన్నంగా ఉండేవి. విజయ్‌ అద్భుతంగా నటించేవాడు. కానీ ఇప్పుడు విజయ్‌ నటుడిగా చాలా ఎదిగాడు. అది ‘లియో’ సెట్‌లో చూడటం ఆనందంగా అనిపించింది. నేను ఆయనతో కలిసి చేసిన సినిమాలోని పాత్రలకంటే ఇందులోని పాత్ర చాలా కొత్తగా ఉంది.
  • ‘లియో’లో నేను చేసిన ‘సత్య’ పాత్రను చంపనని లోకేష్‌ విడుదలకు ముందే చెప్పాడు. అదే చేశాడు. నా పాత్రను చివరివరకూ కొనసాగిస్తారని నాకు ముందే తెలుసు. నేనూ, లోకేష్‌ 2020చివరిలో కలిశాము. ఈ సినిమా చేయటానికి చాలా ఆసక్తితో ఉన్నానని అన్నాడు. రెండేళ్ల తర్వాతా తిరిగి కలిసినప్పుడు రెండు గంటలకు పైగా తన ఆఫీస్‌లో కథను వివరించాడు. మేము అనుకున్నదానికంటే ఎక్కువగానే ఈ సినిమాను ఆదరించారు ప్రేక్షకులు.
  • దాదాపు రెండేళ్లపాటు ఈ చిత్రంకోసం పనిచేశాను. లోకేష్‌ రూపొందించిన ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నాను. కొన్ని సన్నివేశాల కోసం రిహార్సల్స్‌ కూడా ఎక్కువ చేయలేదు. ఆరునిమిషాల సన్నివేశాన్ని కూడా సింగిల్‌ టేక్‌లో చేశాము. విజయ్‌, నేను చేసిన ఆ మ్యాజిక్‌ ఎంత అద్భుతంగా ఉందో తెరపై చూస్తేనే తప్ప అర్థంకాలేదు. అంతేకాదు షూటింగ్‌ను కూడా తొందరగా ముగించినందుకు లోకేష్‌ సంతోషపడ్డాడు.

  • నాకు 19లేదా 20 ఏళ్లు ఉన్నప్పుడు మొదటిసారి విజయ్‌ని కలిశాను. ఎవరితోనైనా 20ఏళ్లకు పైగా స్నేహంగా ఉండి, వారితో మళ్లీ కలిసి పనిచేసినప్పుడు నిజంగా సొంత ఇంటికి తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది. విజయ్‌ విషయంలో నాకు అదే అనిపించింది. లోకేష్‌ కనగరాజ్‌ మా విషయంలో అలాంటి అనుభూతి కలిగేలా చేశారు.

  • ‘ఖైదీ’, ‘మాస్టర్‌’, ‘విక్రమ్‌’ లాంటి సినిమాలు తీసిన లోకేష్‌ పనితీరు నాకు చాలా నచ్చింది. ఫాంటసీ, ఫిక్షన్‌, మాస్‌...ఇలా అన్నీ అంశాలను ఎంతో వినోదాత్మకంగా తీస్తాడు. నేను కూడా లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో ‘లియో’తో భాగం కావడం ఆనందంగా ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని