Yami Gautam: దయచేసి.. ఇకపై నా గురించి రాయకండి: యామీ గౌతమ్‌

‘విక్కీ డోనర్‌’, ‘బాలా’, ‘ఉరి’ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన నటి యామీ గౌతమ్‌. కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ కోసం ఆమె ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘దస్వీ’..

Published : 08 Apr 2022 14:49 IST

ముంబయి: ‘విక్కీ డోనర్‌’, ‘బాలా’, ‘ఉరి’ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన నటి యామీ గౌతమ్‌. కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ కోసం ఆమె ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘దస్వీ’. తుషార్‌ జలోట దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 7న జియో సినిమా, నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చదువు ప్రాముఖ్యతను చాటి చెప్పేలా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో అభిషేక్‌ బచ్చన్‌, నిమ్రత్‌ కౌర్‌ కీలకపాత్రలు పోషించారు. మిశ్రమ స్పందనలకే పరిమితమైన ఈ సినిమాపై ఓ బాలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ రివ్యూ రాసుకొచ్చింది. యామీ గౌతమ్‌ నటన గురించి ప్రస్తావిస్తూ.. ఇంతకాలం చేసిన సాధారణ ప్రియురాలి పాత్రలకు యామీ ఈ సినిమాతో ఫుల్‌స్టాప్‌ పెట్టారని, ఈ సినిమాలో ఆమె నటన గతంతో పోలిస్తే ఫర్వాలేదని రాసుకొచ్చింది. దీంతో ఆ రివ్యూపై యామీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపయోగకరమైన విమర్శలను అంగీకరిస్తానని, ఇలాంటి విమర్శలపై పెదవి విప్పక తప్పదని ఆమె చెప్పుకొచ్చారు.

‘‘విమర్శలకు నేను ఎప్పుడూ విలువనిస్తూనే ఉంటాను. విమర్శల్లోని వాస్తవాన్ని గ్రహించి తప్పులను సరిచేసుకోవడం నాకు అలవాటు. కానీ, కొంతమంది మాత్రం కావాలనే అర్థంలేని వ్యాఖ్యలు చేసి తరచూ మనల్ని కిందకు లాగేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి వాటి గురించి తప్పకుండా పెదవి విప్పాలి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎన్నో కష్టాలు ఎదుర్కొని నటిగా ఈ స్థాయికి వచ్చాను. ‘బాలా’, ‘ఉరి’ వంటి ఎన్నో విభిన్న చిత్రాల్లో భాగమయ్యాను. కానీ, ఇంతకాలం నేను చేసిన వర్క్‌ని విమర్శిస్తూ ఈవిధంగా కామెంట్‌ చేయడం అమర్యాదపూర్వకం. ఇప్పటివరకూ మీ పోర్టల్‌ని నేను ఫాలో అయ్యేదాన్ని. కానీ ఇకపై మిమ్మల్ని ఫాలో కావాలనుకోవడం లేదు. అలాగే, దయచేసి నా గురించి మీరు రివ్యూలు రాయకండి’’ అని యామీ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని