
భారత సంతతి వ్యక్తి త్యాగానికి గుర్తింపు
అమెరికాలో రహదారికి సందీప్ సింగ్ ధలివాల్ పేరు
హ్యూస్టన్: కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్న భారత సంతతి వ్యక్తి త్యాగానికి గుర్తుగా.. అగ్రరాజ్యంలోని టోల్‌వేలో కొంత భాగానికి ఆయన పేరు పెట్టారు. అమెరికా, టెక్సాస్ రాష్టంలోని హ్యూస్టన్ పట్టణంలో ట్రాఫిక్ విధి నిర్వహణలో ఉన్న 42 ఏళ్ల సందీప్ సింగ్ ధలివాల్‌ను ఓ దుండగుడు కాల్చిచంపాడు. ఈయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సందీప్ సింగ్ అత్యుత్తమ త్యాగానికి, అంకిత భావానికి నివాళిగా అక్కడి ‘బెల్ట్‌వే 8 టోల్‌వే’లో కొంత భాగాన్ని ‘డెప్యుటీ సందీప్ సింగ్ ధలివాల్ మెమోరియల్ టోల్‌వే’ అని పిలవనున్నారు.
సందీప్ సింగ్, హారిస్ ప్రాంతానికి తొలి సిక్కు పోలీసు ఉన్నతాధికారిగా పదేళ్లపాటు విధులు నిర్వహించారు. 10,000 మంది సిక్కులు నివసించే ఈ ప్రాంతానికి చెందిన ఆయనకు సిక్కు సంప్రదాయానుసారం తలపాగా, గడ్డంతోనే విధులు నిర్వహించేందుకు అమెరికా ప్రభుత్వం అనుమతించింది. ఈ ఘనత సాధించిన తొలి సిక్కు వ్యక్తిగా నాడు ఆయన పేరు పతాక శీర్షికల్లో నిలిచింది.
కాగా, గత సంవత్సరం సెప్టెంబర్‌లో ట్రాఫిక్ సిగ్నల్ సూచనలకు విరుద్ధంగా వాహనాన్ని నడుపబోయిన రాబర్ట్ సోలిస్ అనే వ్యక్తిని సందీప్ ఆపారు. ఇంతలో ఆ వ్యక్తి తన కారు నుంచి బయటకు వచ్చి పలుమార్లు కాల్పులు జరిపడంతో సింగ్ మరణించారు. ప్రస్తుతం జైలులో ఉన్న రాబర్ట్‌కు ఈ కేసులో మరణశిక్ష విధించారు. కొత్తగా చేరిన ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే సూపర్వైజర్గా సందీప్ సింగ్‌కు పదోన్నతి లభించనున్న సమయంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.