Updated : 24/05/2021 07:59 IST

USA: ఆలింగనాలు.. కరచాలనాలు..

మాస్కులు తీసేసి ముచ్చట్లు 

 శ్వేతసౌధంలో మునుపటి ఉత్సాహం

కరోనా నుంచి బయటపడుతున్న అమెరికా

వాషింగ్టన్‌: కొవిడ్‌ కోరల నుంచి అమెరికా క్రమేపీ బయటపడుతున్న వేళ.. అధ్యక్ష భవనం శ్వేతసౌధంలో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. మాస్కుల్లేకుండా ఒకచోట గుమిగూడి కనిపిస్తున్నారు. వారిలో నవ్వులు విరబూస్తున్నాయి. అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పలువురు ప్రముఖులతో కరచాలనాలు, ఆత్మీయ ఆలింగనాలు వంటివాటితో ఆనందకర వాతావరణం కనిపిస్తోంది. అమెరికాలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతుండటంతో ఆంక్షలు సడలించడం వల్ల క్రమేపీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. టీకాలతో మునుపటి వాతావరణం సాధ్యమేనన్న సంకేతాలను శ్వేతసౌధం అందిస్తోంది. ఇక్కడ సిబ్బంది సంఖ్య పెరిగింది. రిపోర్టర్ల సంఖ్యపై కూడా పరిమితులు తొలగిపోతున్నాయి. మునుపటి వాతావరణానికి మళ్లీ చేరుకున్నామని శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకీ శుక్రవారం ప్రకటించారు. ఇక్కడ గత వారం రోజుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. సందర్శకులు, అధికారులు ఆరు గజాల దూరం పాటించే అవసరం లేకుండా పోయింది. ఈ వాతావరణాన్ని అందరికంటే ఎక్కువగా బైడెన్‌ ఆస్వాదిస్తున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఆంక్షల సడలింపుపై కొన్ని వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ.. శ్వేతసౌధంలో మాత్రం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. మే 13న ఆంక్షలను సడలిస్తూ బైడెన్‌ ప్రకటన చేశారు. రెండు డోసులు తీసుకున్నవారు మాస్కు ధరించాల్సిన అవసరం లేదని అమెరికాలోని అంటువ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం స్పష్టం చేసిన తర్వాత ఆయన కూడా మాస్కు లేకుండా కనిపించారు.

దక్షిణ కొరియా అధినేత సైతం..

వరుసగా రెండోరోజైన శుక్రవారం శ్వేతసౌధంలోని అతిపెద్ద గది అయిన ఈస్ట్‌ రూమ్‌ను తెరిచారు. అమెరికా కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ హోదాలో తొలిసారి జో బైడెన్‌ ‘మెడల్‌ ఆఫ్‌ ఆనర్‌’ ప్రదానం చేశారు. 70 ఏళ్ల క్రితం కొరియా యుద్ధంలో చూపిన ధైర్యసాహసాలకు గుర్తుగా 94 ఏళ్ల రిటైర్డ్‌ కర్నల్‌ రాల్ఫ్‌ పకెట్‌ జూనియర్‌ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. అమెరికా పర్యటనలో ఉన్న దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ హాజరయ్యారు. ఇరువురు నేతలూ రాల్ఫ్‌తో పలుమార్లు కరచాలనం చేశారు. ఆ యుద్ధవీరుడి కుటుంబీకులతో ఫొటోలు దిగారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. మూన్‌ జే ఇన్‌తోనూ ఆమె కరచాలనం చేశారు. అంతకు ముందురోజే ఈస్ట్‌రూమ్‌లో ఓ భారీ కార్యక్రమం జరిగింది. చట్టసభ్యుల సమక్షంలో.. ఆసియా అమెరికన్లపై నేరాలకు వ్యతిరేకంగా రూపొందించిన బిల్లుపై బైడెన్‌ సంతకం చేశారు. హౌస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ సహా ఇతర చట్టసభ్యులు పరస్పరం ఆలింగనాలు చేసుకోవడం వంటి దృశ్యాలు కనిపించాయి. చట్టసభ్యులు పాల్గొన్న కార్యక్రమంలో బైడెన్‌ షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడం, అవతలి వ్యక్తుల చిరునవ్వులను చూసే అవకాశం రావడం ఈ కార్యక్రమంలో ఓ మంచి అనుభూతి అని సెనేటర్‌ సుసాన్‌ కొలిన్స్‌ చెప్పారు. కార్యక్రమం నుంచి వెళ్లిపోయే ముందు బైడెన్‌ సైతం పలువురికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చారు. పరిస్థితులు చక్కబడుతున్న వేళ.. బైడెన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఉన్న వాతావరణాన్ని పలువురు ఇప్పటితో పోల్చుకుంటున్నారు. వైరస్‌ భయాలతో బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుత క్షణాలను ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. 

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని