ఆర్టికల్‌ 370 కథ ముగిసింది: భాజపా

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ -370 కథ ముగిసిందని భాజపా పునరుద్ఘాటించింది. భారతదేశ రాజ్యాంగ దేవాలయమైన పార్లమెంట్‌లో నిబంధనల ప్రకారం దానిని శాశ్వతంగా పూడ్చివేశామని తెలిపింది. గత ఆగస్టు 5న రాజ్యాంగ బద్ధంగా రద్దు చేసిన ఆర్టికల్‌ 370ని తిరిగి తీసుకురావాలని కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారని, అయితే అది వృథా ప్రయాసే..

Updated : 23 Nov 2020 05:24 IST

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 కథ ముగిసిందని భాజపా పునరుద్ఘాటించింది. దేశ రాజ్యాంగ దేవాలయమైన పార్లమెంట్‌లో నిబంధనల ప్రకారం దానిని శాశ్వతంగా పూడ్చివేశామని తెలిపింది. గత ఆగస్టు 5న రాజ్యాంగబద్ధంగా రద్దు చేసిన ఆర్టికల్‌ 370ని తిరిగి తీసుకురావాలని కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారని, అయితే అది వృథా ప్రయాసే అవుతుందని భాజపా పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌ వెల్లడించారు. ఇటీవల ఆయన భాజపా జమ్ముకశ్మీర్‌ ఎన్నికల ఇన్‌ఛార్జిగా నియమితులయ్యారు.

రాష్ట్ర పర్యటనలో ఉన్న హుస్సేన్‌ మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు నిర్ణయంపైనా, న్యాయవ్యవస్థపైనా మాట్లాడదలచుకోలేదన్నారు. అయితే కొన్ని పార్టీలతో కలిసి ఏర్పడిన ‘గుప్కార్‌ గ్యాంగ్‌’ ఆర్టికల్‌ 370 తిరిగి అమల్లోకి తెస్తామని చెబుతున్నారని, కానీ అది కలగానే మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. ‘‘రాజ్యాంగ నిబంధనల ప్రకారం రెండు సభలు ఆమోదం తెలిపిన తర్వాతనే ఆ ఆర్టికల్‌ను రద్దు చేశాం. అంతేకాకుండా ఆర్టికల్‌ 370ని రద్దు చేసింది భాజపా కాదు. ఆ పని చేసింది పార్లమెంట్‌. అందువల్ల చివరికి ఐక్యరాజ్య సమితి కలగజేసుకున్నా ఏమీ చేయలేదు’’ అని అన్నారు. దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ్‌ మార్గ్‌ కార్యాలయంలో ఆ ఆర్టికల్‌ను రద్దు చేశారా? అని ప్రశ్నించారు.

ఒకవేళ నిర్ణయం తీసుకునే దశలో ఉంటే పరిశీలించే వీలుండేదని, అయితే ఆ ఆర్టికల్‌ను ఇప్పటికే సమాధి చేసినందున ఎవరూ ఏమీ చేయలేరని హుస్సేన్‌ అభిప్రాయపడ్డారు. ఆర్టికల్‌ 370 అంశం ఇంకా న్యాయస్థానం పరిధిలోనే ఉంది కదా? దానిని పునరుద్ధరించలేమని మీరెలా చెప్తారు? అని విలేకరులు ప్రశ్నించగా.. ప్రస్తుత రోజుల్లో అన్ని అంశాలను కోర్టులు పరిశీలనకు తీసుకుంటున్నాయి కదా! అని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఆర్టికల్‌ 370ని తిరిగి తీసుకొస్తామని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ భావిస్తున్నటయితే ఆ నమ్మకంపైనే ఉండాలన్నారు. ‘ఆమె నమ్మకం ఆమెది..నా నమ్మకం నాది’ అని షానవాజ్‌ హుస్సేన్‌ వ్యాఖ్యానించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని