రాబోయేది నితీశ్‌ లేని ప్రభుత్వమే: చిరాగ్‌

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తున్నాయి. జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌కుమార్‌తో రాజకీయ విభేదాలతో ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన...

Published : 26 Oct 2020 00:37 IST

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తున్నాయి. జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌కుమార్‌తో రాజకీయ విభేదాల కారణంగా ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన ఎల్‌జేపీ సారథి చిరాగ్‌ పాస్వాన్‌ ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఓవైపు భాజపాకు అనుకూలంగా మాట్లాడుతూ రాష్ట్రంలో నితీశ్‌కుమార్‌ లేని ప్రభుత్వం అధికారం చేపడుతుందని చెబుతున్నారు. ఈ మేరకు భాజపాకు అనుకూలంగా ఉంటూ జేడీయూకు వ్యతిరేకంగా ఉన్నవారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.‘ బిహార్‌ ఫస్ట్‌’ అమలు కావాలంటే ఎల్‌జేపీకి ఓటు వేయాలని కోరుతున్నారు. ‘‘ఎల్‌జేపీ బరిలో లేని చోట్ల భాజపాకు ఓటేయండి. రానున్నది నితీశ్‌లేని ప్రభుత్వమే’’ అంటూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

మొత్తం 243 స్థానాలకు గానూ ఎల్‌జేపీ 138 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. ఇందులో 122 స్థానాల్లో ప్రత్యర్థి జేడీయూ, జితిన్‌ రామ్‌ మాంఝీ నేతృత్వంలోని హెచ్‌ఏఎం కావడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 5 స్థానాల్లోనే భాజపాకు వ్యతిరేకంగా ఎల్‌జేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. దీనిని బట్టి ఎల్‌జేపీ పరోక్షంగా కాషాయ పార్టీకి మద్దతిస్తున్నట్లే చెప్పాలి.ఒక వేళ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా నితీశ్‌కుమార్‌ బాధ్యతలు చేపడతారని భాజపా ఇప్పటికే ప్రకటించింది. నితీశ్ నాయకత్వాన్ని విమర్శించిన వాళ్లకు ఎన్డీయేలో స్థానం లేదని కూడా స్పష్టం చేసింది. తద్వారా ప్రభుత్వ ఏర్పాటులో పాస్వాన్‌ ప్రమేయం ఉండబోదని కూడా చెప్పింది. కేవలం ఓట్లను చీల్చేందుకే ఎల్‌జేపీ ఈ కుయుక్తులు ప్రదర్శిస్తోందని భాజపా ఆరోపించింది.

అయితే, చిరాగ్‌ పాస్వాన్‌పై భాజపా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో కాషాయదళానికి చిరాగ్‌ పార్టీ ‘టీమ్‌ -బి’ వ్యవహరిస్తోందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ అనుకోని పరిణామాలు ఎదురైతే ఎల్‌జేపీతో కలిసి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంటున్నారు. అంతేకాకుండా లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి నితీశ్‌కుమార్‌పై ఆరోపణలకు దిగుతున్న చిరాగ్‌.. భాజపాకు వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. తన గుండెను చీలిస్తే అందులో మోదీ చిత్రం కనిపిస్తుందని చిరాగ్‌ బహిరంగంగా చెప్పడమే దీనికి ఉదాహరణ. ఎన్డీయేలో నాయకత్వ మార్పిడి జరగాలని, నితీశ్‌కు బదులుగా వేరే వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఎల్‌జేపీతో పాటు భాజపాలోని మరో వర్గం కూడా చాలా పట్టుబట్టింది. అయితే దానికి వ్యతిరేకంగా పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకోవడంతో ఎల్‌జేపీ బయటకు వచ్చి ఒంటరిగా బరిలోకి దిగుతోంది. ఈ రాజకీయ క్రీడకు ఓ ముగింపు రావాంటే ఎన్నికల ఫలితాల వరకు చేసి చూడాల్సిందే. మొత్తం 243  స్థానాలకు అక్టోబర్‌ 28 నుంచి మూడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని