యువ ఓటర్ల ఆకర్షణకు కాంగ్రెస్‌ కొత్త ఎత్తుగడ

నానాటికీ దేశంలో కాంగ్రెస్‌ ప్రభ తగ్గుతోంది. యువ ఓటర్లు ఆ పార్టీకి దూరమవుతున్నారు. పూర్తి స్థాయి నాయకత్వలేమి పార్టీని వెంటాడుతోంది. ఇటీవల ఈ అంశాలే ఎజెండాగా పార్టీ సీనియర్లు కాంగ్రెస్‌ అధినేత్రికి లేఖాస్త్రం......

Published : 07 Sep 2020 01:16 IST

లఖ్‌నవూ: నానాటికీ దేశంలో కాంగ్రెస్‌ ప్రభ తగ్గుతోంది. యువ ఓటర్లు ఆ పార్టీకి దూరమవుతున్నారు. పూర్తి స్థాయి నాయకత్వలేమి పార్టీని వెంటాడుతోంది. ఇటీవల ఈ అంశాలే ఎజెండాగా పార్టీ సీనియర్లు కాంగ్రెస్‌ అధినేత్రికి లేఖాస్త్రం సంధించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో యువ ఓటర్లకు గాలం వేసేందుకు యూపీ కాంగ్రెస్‌ వినూత్న పంథాలో ముందుకెళుతోంది. వారిని ఆకట్టుకునేందుకు క్విజ్‌ పోటీ నిర్వహిస్తోంది.

ఈ నెల 13, 14 తేదీల్లో యూపీ కాంగ్రెస్‌ ఈ పోటీ నిర్వహించనుంది. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వ్యక్తిత్వం, విజయాలపై ప్రశ్నలు ఉండనున్నాయి. 16-22 ఏళ్ల వయసున్న వారు ఈ క్విజ్‌లో పాల్గొనవచ్చు. ఇప్పటికే 5 లక్షల మంది ఈ పోటీలో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నారని, దాదాపు 20 లక్షల మంది వరకు ఇందులో పాల్గొనే అవకాశం ఉందని యూపీ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అశోక్‌ సింగ్‌ తెలిపారు.

ఈ క్విజ్‌ ద్వారా యువత మాజీ ప్రధాని వ్యక్తిత్వం, విజయాలు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందని అశోక్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఈ పోటీ అనంతరం వారితో పార్టీ సంభాషించనుందని తెలిపారు. యువత ముందుకు రావాలన్నదే పార్టీ నాయకత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. భాజపా ప్రజా వ్యతిరేక విధానాలతో యువత తీవ్ర అవస్థలు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలు ఎంతమేర ఫలిస్తాయో చూడాలి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని