AAP: గోవాలో హంగ్ అంచనా.. కాంగ్రెస్ బాటలోనే ఆప్‌..!

గోవాలో హంగ్ తలెత్తే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించడంతో అక్కడి పార్టీలు అప్రమత్తమయ్యాయి.

Updated : 09 Mar 2022 14:35 IST

పనాజీ: గోవాలో హంగ్ తలెత్తే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించడంతో అక్కడి పార్టీలు అప్రమత్తమయ్యాయి. కాంగ్రెస్ ఇప్పటికే తన అభ్యర్థుల్ని రిసార్టుకు తరలించగా.. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆ తరహాలోనే వ్యవహరిస్తోంది. తమ అభ్యర్థుల్ని రక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. 

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్ మెజార్టీ మార్కుకు కాస్త దూరంలో ఆగిపోతాయని ఎగ్జిట్ పోల్స్‌ అంచనా వేశాయి. ఈ క్రమంలో 2017 నాటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకునేందుకు కాంగ్రెస్‌, ఆప్‌ తమ అభ్యర్థుల్ని కాచుకోవడం ప్రారంభించాయి. కాంగ్రెస్‌ ఇప్పటికే తమ అభ్యర్థులందరినీ ఉత్తర గోవాలోని ఓ రిసార్ట్‌కు తరలించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మార్చి 10, గురువారం మధ్యాహ్నం వరకు వారంతా అక్కడే ఉండాలని పార్టీ హైకమాండ్ సూచించినట్లు తెలుస్తోంది. ఇక, ఎన్నికల ఫలితాలు వెలువడే రోజున కూడా కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎవరూ కౌంటింగ్‌ కేంద్రాలకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. మరోపక్క తృణమూల్ కాంగ్రెస్ మూడు స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. దాంతో ప్రభుత్వ ఏర్పాటులో ఈ పార్టీ కీలకంగా మారొచ్చని తెలుస్తోంది. 

40 నియోజకవర్గాలున్న గోవా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 21 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ హంగ్‌ ఏర్పడింది. 17 సీట్లతో కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. 13 సీట్లు గెలిచిన భాజపా ఇతర చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని