Malvika Sood: కాంగ్రెస్‌లో చేరిన సోనూసూద్‌ సోదరి

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పంజాబ్‌ రాజకీయాల్లో చేరికలు మొదలయ్యాయి. ప్రముఖ నటుడు సోనూసూద్‌ సోదరి మాళవిక సూద్‌ సోమవారం కాంగ్రెస్‌ పార్టీలో

Published : 10 Jan 2022 18:40 IST

చండీగఢ్‌: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పంజాబ్‌ రాజకీయాల్లో చేరికలు మొదలయ్యాయి. ప్రముఖ నటుడు సోనూసూద్‌ సోదరి మాళవిక సూద్‌ సోమవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ ఉదయం మోగాలోని సోనూసూద్‌ నివాసానికి వెళ్లిన పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూ.. వారితో కొంతసేపు ముచ్చటించారు. ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ, సిద్ధూ సమక్షంలో మాళవిక.. కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.  

తన సోదరి మాళవిక రాజకీయాల్లో చేరనున్నారని, పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని గతేడాది నవంబరులో సోనూసూద్‌ ప్రకటించారు. అయితే తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లో ఓటింగ్‌ శాతం పెంపుదలకు ఎన్నికల సంఘం ప్రచారకర్తగా ఉన్న సోనూసూద్‌ నియామకాన్ని ఈసీ ఉపసంహరించుకుంది. దాదాపు ఏడాది క్రితం ఆయన్ని ప్రచారకర్తగా నియమించగా.. మాళవిక రాజకీయాల్లోకి వస్తోన్న నేపథ్యంలో దాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు గతవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. అయితే తన సోదరి పోటీ చేస్తుండటంతో తానే స్వచ్ఛందగా ఎన్నికల సంఘం ప్రచారకర్తగా వైదొలిగినట్లు సోనూసూద్‌ చెప్పారు.

ఇదిలా ఉండగా.. కరోనా మహమ్మారి ఉద్ధృతి సమయంలో ఎంతోమందిని ఆదుకుని మానవత్వాన్ని చాటిన సోనూసూద్‌పై గతేడాది ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ నటుడికి అండగా నిలిచి కేంద్రంపై విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో తాజాగా సోనూ సోదరి హస్తం పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పంజాబ్‌లో ఫిబ్రవరి 14న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌.. సెలబ్రిటీలతో ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తోంది. మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ కూడా త్వరలోనే కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల భజ్జీ కూడా సిద్ధూతో భేటీ అవడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్లైంది. మరోవైపు ఇప్పటికే పార్టీ అంతర్గత సమస్యలు పంజాబ్‌ కాంగ్రెస్‌ను వేధిస్తున్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని