
TS News: రైతులు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: నిరంజన్‌రెడ్డి
పరకాల: రైతులు ధైర్యంగా ఉండాలని అకాల వర్షాలకు నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో కలిసి పర్యటించిన నిరంజన్‌రెడ్డి ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఇవాళ సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించి పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించాలని భావించారు. చివరి నిమిషంలో పర్యటన రద్దవగా.. సీఎం ఆదేశాలతో మంత్రి వరంగల్‌లో పర్యటించారు. నష్టాన్ని ప్రత్యక్షంగా చేసేందుకు వచ్చిన పంట నష్టపోయిన రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. చేతికొచ్చిన పంట నేలపాలు అయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మహిళా రైతులు సైతం మంత్రి కాళ్ల మీద పడ్డారు. మంత్రి వెంటే ఉన్న ఎర్రబెల్లి దయాకరరావును సైతం వేడుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ..‘‘అకాల వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రైతులు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం. చేతికొచ్చిన మిరప నేలరాలింది. నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, మంథని ప్రాంతాల్లో మిర్చి దెబ్బతింది. సీఎం ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పంట నష్టం పరిశీలిస్తున్నాం. నష్టపోయిన రైతుల పంటల వివరాలు క్షేత్రస్థాయిలో సేకరిస్తున్నాం. రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. సీఎం కేసీఆర్ దృష్టికి పరిస్థితులను తీసుకెళ్తాం’’ అని అన్నారు.