Andhra News: రాజధాని మహిళలకు మంత్రుల సానుభూతి అక్కర్లేదు.. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

మహిళా రైతులు కాళ్లు కందిపోయి పాదయాత్ర చేస్తున్నారని, వారికి మంత్రుల సానుభూతి అక్కరలేదని, కన్నూమిన్నూ కానకుండా మాట్లాడటం మానుకోవాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు.

Updated : 01 Oct 2022 07:14 IST

ఈనాడు, దిల్లీ : మహిళా రైతులు కాళ్లు కందిపోయి పాదయాత్ర చేస్తున్నారని, వారికి మంత్రుల సానుభూతి అక్కరలేదని, కన్నూమిన్నూ కానకుండా మాట్లాడటం మానుకోవాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. ఇక్కడ శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళా రైతుల బొబ్బలెక్కిన పాదాలను స్పృశించి క్షమాపణలు కోరినా మంత్రుల పాపానికి పరిహారం లేదన్నారు. ‘మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే రుషికొండలో ముఖ్యమంత్రి నివాస సముదాయం, కార్యాలయ భవనాలు నిర్మిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన దానికంటే పది రెట్లు పెద్ద భవనాలను రుషికొండపై నిర్మిస్తున్నారు. విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ బృందం నివేదికను బహిర్గతం చేయాలి. రూ.వేల కోట్ల విలువ చేసే వేల ఎకరాల భూములను కొల్లగొట్టినందునే విశాఖను రాజధానిగా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. విశాఖలో రాణి ఆస్తి 15 ఎకరాల భూమిని గతంలో ఆమెతో ఒప్పందం చేసుకున్న వారికి కాకుండా ఇతరులకు ఆ భూమి దక్కడం పరిశీలిస్తే దీని వెనక ఉన్న మతలబు ఏమిటో తెలిసిపోతోంది...’ అని రఘురామ పేర్కొన్నారు. ‘సినీ నటుడు దివంగత కృష్ణంరాజు కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉంటానని చెప్పమన్నారని మంత్రి రోజా వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉంది. దీని వెనక రాజుల ఓట్లు గంపగుత్తగా వస్తాయన్న రాజకీయ ఎత్తుగడే కారణమై ఉంటుంది’ అని రఘురామ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని