
Goa elections: నిన్న పంజాబ్.. నేడు గోవా: సీఎం అభ్యర్థిని ప్రకటించిన ఆప్
పనాజీ: దిల్లీకే పరిమితమైన అధికారాన్ని మరిన్ని రాష్ట్రాలకు విస్తరించాలని చూస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు పెంచింది. మంగళవారం పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన ఆ పార్టీ.. బుధవారం గోవా సీఎం అభ్యర్థిని ప్రకటించింది. న్యాయవాది, సామాజిక కార్యకర్త అయిన అమిత్ పాలేకర్‌ను సీఎం అభ్యర్థిగా నిర్ణయించినట్లు ఆ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన చేశారు.
అమిత్ పాలేకర్‌ది ఓబీసీ బండారీ సామాజిక వర్గం. గోవాలో దాదాపు 35 శాతం జనాభా వీరే ఉన్నారు. ఇటీవల పాత గోవాలోని చారిత్రక ప్రాంతంలో అక్రమ కట్టడాలను నిరసిస్తూ నిరాహార దీక్ష చేపట్టి పాలేకర్ వార్తల్లో నిలిచారు. గతేడాది అక్టోబర్‌లో ఆప్‌లో చేరారు. సీఎం అభ్యర్థిగా పాలేకర్‌ను ప్రకటించక ముందు గోవానే గుండెచప్పుడుగా, గోవా కోసం నిజాయతీగా పనిచేసే వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. సీఎం అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పాలేకర్, కేజ్రీవాల్ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు.
గోవాలో ప్రస్తుతం భాజపా అధికారంలో ఉంది. 40 స్థానాలకు ఫిబ్రవరి 14న పోలింగ్ నిర్వహించనున్నారు. అటు భాజపాతో పాటు, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన సైతం ఎన్నికల బరిలో నిలిచాయి. ప్రధాన పార్టీలన్నీ చిన్న రాష్ట్రంపై దృష్టి కేంద్రీకరించడంతో గోవా ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.