తాడేపల్లి ప్యాలెస్‌లో సజ్జల ఎలాగో.. తితిదేలో ధర్మారెడ్డి అలాగే: ఆనం వెంకటరమణారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం అధికార పార్టీ నేతల అవినీతికి అడ్డాగా మారిందని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి ధ్వజమెత్తారు.

Updated : 16 Nov 2023 13:58 IST

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం అధికార పార్టీ నేతల అవినీతికి అడ్డాగా మారిందని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి ధ్వజమెత్తారు. భూమన కరుణాకరరెడ్డి తితిదే చైర్మన్ అయ్యాక.. దేవస్థానం డబ్బుల్ని తన కుమారుడు అభినయ్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆనం మాట్లాడారు.  తిరుపతి పరిధిలో ఏ పనికైనా 10 శాతం లంచం తీసుకుంటున్న భూమన కరుణాకరరెడ్డిని ఇప్పటికే 10 శాతం కరుణాకరరెడ్డిగా పిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. తితిదే ఉద్యోగులకు కేటాయించిన స్థలాల చుట్టూ అభినయ్‌రెడ్డి 5.45 ఎకరాలు ఎలా కొనుగోలు చేశారో సమాధానం చెప్పాలని ఆనం డిమాండ్‌ చేశారు.

తిరుమల శ్రీవారి సొమ్ము తిన్న ప్రతి రూపాయినీ తెలుగుదేశం అధికారంలోకి రాగానే కక్కిస్తామని ఆనం హెచ్చరించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో సజ్జల ఎలాగో తితిదేలో ధర్మారెడ్డి వ్యవహారం అలాగే ఉందని విమర్శించారు. ధర్మారెడ్డి అవినీతిపై 14 సెక్షన్ల కింద దిల్లీలో గతంలో క్రిమినల్ కేసు నమోదైందన్నారు. ఆ కేసుని దాచిపెట్టి ఆయన తితిదే ఈవో అయ్యారని.. అదే అవినీతి ఇప్పుడు తితిదేలో చేయరనే నమ్మకమేంటని నిలదీశారు. క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తికి తితిదేలో కీలక పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తితిదేని అడ్డుపెట్టుకుని దిల్లీలో ధర్మారెడ్డి లాబీయింగ్ చేస్తున్నారని ఆరోపించారు. దిల్లీలో నమోదైన కేసుపై తీర్పు వచ్చే వరకు ధర్మారెడ్డిని తితిదే బాధ్యతల నుంచి తప్పించాలని ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు