CM Jagan: విశాఖ నుంచే పరిపాలన చేయబోతున్నా: సీఎం జగన్‌

విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని ఏసీ సీఎం వైఎస్‌ జగన్‌ మరోసారి స్పష్టం చేశారు. త్వరలోనే ఇది సాకారం అవుతుందన్నారు.

Updated : 03 Mar 2023 16:49 IST

విశాఖ: దేశ ప్రగతిలో ఆంధ్రప్రదేశ్‌ (andhra pradesh) రాష్ట్రం ఎంతో కీలకంగా మారిందని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ (ys jagan mohan reddy) తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని.. దాదాపు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్రం వేదిక కానుందని అన్నారు. విశాఖ వేదికగా జరుగుతున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌)లో జగన్‌ మాట్లాడారు.

‘‘రాష్ట్రంలో 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు అవకాశాలున్నాయి. సదస్సు మొదటి రోజు వివిధ సంస్థలతో 92 ఒప్పందాలు (ఎంవోయూ) జరిగాయి. 340 సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. రాష్ట్రంలో 6 పోర్టులు ఉన్నాయి.. మరో 4  పోర్టులు రాబోతున్నాయి. పోర్టులకు సమీపంలో పుష్కలంగా భూములున్నాయి. నైపుణ్యం కలిగిన యువతకు ఏపీలో కొదవ లేదు’’ అని సీఎం తెలిపారు.

ఈ సందర్భంగా విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని జగన్‌ మరోసారి స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. భౌగోళికంగా పరిశ్రమలకు ఏపీ అనుకూలం. రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. ఏపీలో క్రియాశీలక ప్రభుత్వం ఉంది. విశాఖ త్వరలో పరిపాలన రాజధాని కాబోతోంది. నేను కూడా విశాఖ నుంచే పాలన చేయబోతున్నాను. త్వరలోనే ఇది సాకారం అవుతుంది’’ అని సీఎం జగన్‌ వెల్లడించారు.

ఏపీలో మా పెట్టుబడులు కొనసాగుతాయి: ముఖేశ్‌ అంబానీ

‘‘సంస్కృతి, సంప్రదాయాలకు ఏపీ నిలయం. ఏపీలో కీలక రంగాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ ముందుంది. సీఎం జగన్‌ నాయకత్వంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. సుదీర్ఘ  తీర ప్రాంతం ఉన్న రాష్టం ఏపీ. ఏపీలో జియో నెట్‌ వర్క్‌ వేగంగా వృద్ధి చెందింది. పలు రంగాల్లో ఏపీ అభివృద్ధికి సంతోషిస్తున్నాం. సౌర విద్యుత్‌ రంగంలో రిలయన్స్‌ పెట్టుబడులు పెడుతుంది. ఏపీలో మా పెట్టుబడులు కొనసాగుతాయి’’ అని ముఖేశ్‌ అంబానీ పేర్కొన్నారు.

ఆరోగ్యశ్రీ పథకం ఇతర దేశాలకు విస్తరించింది. ఆరోగ్య రంగంలో ఏపీ ప్రభుత్వ కృషి అభినందనీయం. అపోలో కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభిస్తోంది.

 - అపోలో ఆస్పత్రి వైస్ ఛైర్మన్‌

ఏపీ పారిశ్రామికీకరణలో శ్రీసిమెంట్‌ తనదైన పాత్ర పోషిస్తోంది. ఏపీలో మా కార్యకలాపాలకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది. రూ. 5 వేల కోట్ల పెట్టుబడితో చాలామందికి ఉపాధి కల్పిస్తాం.

- శ్రీసిమెంట్‌ ఛైర్మన్ హరిమోహన్‌ బంగుర్‌

ఏపీ ప్రగతిలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది. జీఎస్‌డీపీలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉంది. ఏపీలో జిందాల్‌ స్టీల్స్‌ రూ.10వేల కోట్ల పెట్టుబడులతో ఉపాధి కల్పిస్తాం.

- నవీన్ జిందాల్‌

నైపుణ్యం కలిగిన యువతకు ఏపీలో కొదవ లేదు. ఏపీలో పెట్టుబడిదారులకు అనువైన వాతావరణం ఉంది. ఏపీలో కనెక్టివిటీ బాగా పెరిగింది. ముఖ్యమంత్రి జగన్‌ విజన్‌ అద్భుతం.

- జీఎంఆర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని