ఏపీకి అడుగడుగునా అన్యాయం:శైలజానాథ్‌

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తామన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ ఆధ్వర్యంలో దేశ రాజధానిలో కాంగ్రెస్‌ నాయకులు ఇవాళ..

Updated : 13 Mar 2021 12:36 IST

దిల్లీ: విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తామన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ ఆధ్వర్యంలో దేశ రాజధానిలో కాంగ్రెస్‌ నాయకులు ఇవాళ ధర్నా చేపట్టారు. దిల్లీలోని ఏపీ భవన్‌ వద్ద కాంగ్రెస్‌ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకించడంతో పాటు ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ ఆ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శైలజానాథ్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అడుగడుగునా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. 

‘‘ప్రత్యేకహోదా ఇవ్వలేదు. ఇప్పుడేమో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీపై సీఎం జగన్‌ ఎందుకు మౌనంగా ఉంటున్నారు. రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టుకోవాల్సిన బాధ్యత జగన్‌కు లేదా?జగన్‌ తమ పార్టీ ఎంపీలతో పార్లమెంట్‌లో పోరాడాలి. అన్ని పక్షాలను ఎందుకు కలుపుకొని విశాఖ ఉక్కుపై పోరాటం చేయలేకపోతున్నారు. వైకాపా ఎంపీలు పార్లమెంట్‌లో ఎన్నో బిల్లులకు భాజపాకు మద్దతు ఇచ్చారు. స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో ఎందుకు పోరాడలేకపోతున్నారు. గాంధేయ మార్గంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం’’ అని శైలజానాథ్‌ ప్రశ్నించారు. 

ప్రధాని మోదీ దేశంలో ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించడమే పనిగా పెట్టుకున్నారని నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్‌ నేత కొప్పుల రాజు ఆరోపించారు. నష్టాలను సాకుగా చూపి స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని నిర్ణయించారని.. ప్రత్యేక గనులు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని