
Ap News: ఫోరెన్సిక్ ఆడిట్ వివరాలివ్వాలి
డిమాండ్ చేసిన మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్‌గజపతిరాజు
విజయనగరం: మాన్సాస్ ట్రస్ట్‌కు సంబంధించి గత రెండేళ్లుగా ఫోరెన్సిక్ ఆడిట్ ప్రస్తావన తీసుకొస్తున్న సంచయిత గజపతిరాజు, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆ వివరాలను బహిర్గతం చేయాలని మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్, మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు డిమాండ్ చేశారు. ఈ ఫోరెన్సిక్ ఆడిట్ క్లయింట్ ఎవరు, ఆడిట్ జరిగితే నిందితులు ఎవరు అనే వివరాలు వెల్లడించాలని తేల్చిచెప్పారు. ఫలితాలు ఇంతవరకూ ఎందుకు బహిర్గతం చేయలేదని నిలదీశారు. ఏమీ తెలియనట్లుగా ఇప్పుడు మీడియా ముందు అవే నివేదికలు కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ట్రస్టు వ్యవహారాల్లో ఇలాంటి వారి ప్రమేయం కొనసాగుతున్నంతకాలం మాన్సాస్ ట్రస్ట్, దానికి సంబంధించిన విద్యాసంస్థలపై దృష్టి పెట్టడం సాధ్యం కాదన్నారు. 2019 జూన్ 20న మంత్రి బొత్స సత్యనారాయణ, అదే ఏడాది అక్టోబర్ 20న విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, గత ఏడాది జనవరి 21న ఎంపీ విజయసాయిరెడ్డిలు విజయనగరం కలెక్టర్, మాన్సాస్ ఈవోలను అనేక వివరాలు ఎందుకు అడిగారో సమాధానం చెప్పాలని అశోక్‌గజపతిరాజు నిలదీశారు. వీటి ద్వారా ఎలాంటి అనుమానాలు తీర్చుకోవాలనుకుంటున్నారని.. వివరాలు కోరడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో చెప్పాలని అశోక్ డిమాండ్ చేశారు.