Atchannaidu: దెబ్బ మీద దెబ్బతో దిక్కుతోచని స్థితిలో వైకాపా: అచ్చెన్న

తమ అధినేత చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో సీఎం జగన్, వైకాపా గ్యాంగ్ అసహనంతో ఏం మాట్లాడుతున్నారో తెలియని స్థితికి చేరారని అచ్చెన్నాయుడు విమర్శించారు. 

Published : 22 Nov 2023 13:31 IST

అమరావతి: దెబ్బమీద దెబ్బతో వైకాపా దిక్కుతోచని స్థితిలో పడిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. తెదేపా ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంతో వైకాపా భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. తమ అధినేత చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో సీఎం జగన్, వైకాపా గ్యాంగ్ అసహనంతో ఏం మాట్లాడుతున్నారో తెలియని స్థితికి చేరారని విమర్శించారు. గడపగడపకూ వెళ్లిన వైకాపా నేతలను ప్రజలు తరిమి తరిమి కొడుతున్నారన్నారు. భవిష్యత్తులో తాము అందించే పథకాల గురించి చెబుతుంటే వైకాపా నేతలకు ఎందుకంత అసహనమని ఓ ప్రకటనలో ప్రశ్నించారు.

ఎందుకంత కోపం, అక్కసు?

ఆడబిడ్డకు నెలకు రూ.1500 ఇస్తామంటే ఎందుకంత కోపమని నిలదీశారు. చదువుకునే ప్రతి బిడ్డకూ రూ.15 వేలు ఇస్తామంటే ఎందుకంత అసహనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా మూడు సిలిండర్ల హామీపై ఎందుకంత కడుపు మంటని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి హామీపై ఎందుకంత నిరుత్సాహమన్నారు. అన్నదాతకు రూ.20 వేలు ఇస్తామంటే ఎందుకంత అక్కసని ఆక్షేపించారు. బీసీలకు రక్షణ చట్టం తెస్తామంటే బరితెగింపు మాటలేలా? అని ప్రశ్నించారు. ఇంకెన్నాళ్లీ తప్పుడు ప్రచారాలతో కాలం నెట్టుకొస్తారని మండిపడ్డారు. జగన్ రెడ్డిలా ప్రజల వ్యక్తిగత డేటా తెదేపా సేకరించడం లేదన్నారు. వాలంటీర్లతో వివాహేతర సంబంధాల గురించి ఆరా తీసిందెవరని నిలదీశారు. సమాచారాన్నంతా రామ్ ఇన్ఫోటెక్ కంపెనీకి దోచిపెట్టిందెవరని దుయ్యబట్టారు. 2024 ఎన్నికల తర్వాత వైకాపాని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేయడం తథ్యమని అచ్చెన్న ధీమా వ్యక్తం చేశారు.

అమాయకులపై ప్రతాపమా?

మరోవైపు, అనంతపురంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డిపై తాడిపత్రి సెబ్ పోలీసుల దాడిని అచ్చెన్న ఖండించారు. అక్రమ మద్యం సరఫరా చేసే వారిని వదలి అమాయకులపై ప్రతాపం చూపటం ఏంటని ప్రశ్నించారు. ముద్దాయి ఎవరో తెలియకుండా పోలీసులు దాడి చేయడం సెబ్ పనితీరుకు అద్దం పడుతోందని విమర్శించారు. గాయపడిన చంద్రశేఖర్ రెడ్డికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఘటనకు భాద్యులైన సెబ్ పోలీసులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని