Andhra News: పట్టాభి సహా 13 మంది తెదేపా నేతలకు బెయిల్‌ మంజూరు

తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు బెయిల్‌ మంజూరైంది. 

Updated : 03 Mar 2023 18:54 IST

విజయవాడ: తెదేపా(TDP) జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌(kommareddy pattabhi ram)కు బెయిల్‌ మంజూరైంది. కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు పట్టాభిని బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. కృష్ణాజిల్లా గన్నవరం ఘటన కేసులో పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బెయిల్‌ పిటిషన్‌పై గురువారం విజయవాడ కోర్టులో వాదనలు ముగిశాయి.

తుది ఉత్తర్వుల నిమిత్తం న్యాయమూర్తి ఎ.సత్యానంద్‌ కేసును శుక్రవారానికి వాయిదా వేశారు. పట్టాభి తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. పట్టాభి సహా 13 మంది తెదేపా నేతలకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. 3 నెలల పాటు ప్రతి గురువారం పోలీసు స్టేషన్‌లో హాజరు కావాలని బెయిల్‌ నిబంధనల్లో పేర్కొన్నారు.

సీఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు..

గన్నవరం సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెదేపా కార్యకర్తలు రెచ్చగొట్టడం ద్వారా తనకు పట్టాభి సహా ఇంకొందరు తెదేపా నేతలు ప్రాణహాని కలిగించే ప్రయత్నం చేశారని కనకారావు ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏ-1గా పట్టాభి, ఏ-2గా చిన్నా సహా మొత్తం 13 మందిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో గన్నవరం పోలీసులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని