అచ్చెన్నాయుడికి బెయిల్‌ మంజూరు

మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Updated : 28 Aug 2020 16:06 IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ తెదేపా శాసనసభాపక్ష ఉపనేత, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.2లక్షల పూచీకత్తు సమర్పించాలని, దేశం విడిచి వెళ్లరాదని హైకోర్టు షరతులు విధించింది. ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో మందుల కొనుగోళ్లలో అవకతవకలకు సంబంధించిన  కేసులో అప్పటి కార్మికశాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుణ్ని నిమ్మాడలోని తన నివాసంలో జూన్‌ 12న అనిశా అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటికే అనారోగ్యంతో ఉన్న అచ్చెన్నను రోడ్డు మార్గంలో నిమ్మాడ నుంచి విజయవాడ తరలించడం వివాదాస్పదమైంది. పోలీసుల తీరుపై తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఎట్టకేలకు హైకోర్టు ఆదేశాలతో అచ్చెన్నాయుడిని రమేష్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ చికిత్సపొందుతున్న సమయంలోనే ఆయన కరోనా బారినపడ్డారు. దీంతో అచ్చెన్నాయుడు ప్రస్తుతం ఎన్‌ఆర్‌ఐ కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అభిమానుల ప్రార్థనలు ఫలించాయి:రామ్మోహన్‌నాయుడు

తన బాబాయ్‌కు బెయిల్‌ మంజూరు కావడంపై ఎంపీ రామ్మోహన్‌నాయుడు స్పందించారు. తెదేపా, కింజరాపు అభిమానుల ప్రార్థనలు ఫలించాయన్నారు. స్వచ్ఛమైన రాజకీయ జీవితంలో మచ్చలేని నేత అచ్చెన్నాయుడని.. రాజకీయ వేధింపులతో పెట్టిన కేసుల నుంచి అభిమానుల ఆశీస్సులతో బయటకొస్తారన్నారు. బెయిల్‌ వచ్చినా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారని చెప్పారు. ‘‘దయచేసి ఎవరూ పరామర్శలకు రావొద్దు.. మీ అభిమానమే మాకు కొండంత అండ. బాబాయ్‌ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కింజరాపు కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఈ కష్టకాలంలో మా కుటుంబానికి అండగా నిలిచిన తెదేపా అధినేత చంద్రబాబు, నేతలు, కార్యకర్తలకు శిరసువంచి నమస్కరిస్తున్నాను’’ అని రామ్మోహన్‌నాయుడు చెప్పారు.   


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని