Kamareddy: కలెక్టరేట్‌ వద్ద బండి సంజయ్‌ అరెస్టు.. కామారెడ్డిలో మరోసారి ఉద్రిక్తత

కామారెడ్డి కలెక్టరేట్‌ వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కలెక్టర్‌ ఎందుకు సమాధానం చెప్పరో చూస్తానంటూ బండి సంజయ్‌ కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునివ్వడంతో రైతులు, భాజపా శ్రేణులు భారీగా తరలివచ్చారు.

Updated : 06 Jan 2023 20:45 IST

కామారెడ్డి: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi sanjay) కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునివ్వడంతో కామారెడ్డి (kamareddy) కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అడ్లుర్‌ ఎల్లారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కామారెడ్డి కలెక్టరేట్‌ను ముట్టడిస్తానని ప్రకటించారు. పార్టీ కార్యకర్తలు, రైతులతో కలిసి ఆయన కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్నారు. నిన్న జరిగిన ఆందోళన నేపథ్యంలో కలెక్టరేట్‌కు అర కిలోమీటరు దూరంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లను తొలగించి రైతులు, భాజపా కార్యకర్తలు చొచ్చుకు రావడంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. 

ఒక దశలో కలెక్టరేట్‌ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు భాజపా కార్యకర్తలు యత్నించారు. కలెక్టర్‌ వచ్చి కామారెడ్డి బహృత్‌ ప్రణాళికపై సమాధానం చెప్పాలని భాజపా నేతలు డిమాండ్‌ చేశారు. పోలీసులు మాత్రం అనుమతి లేదంటూ బండి సంజయ్‌ను కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. కలెక్టర్‌ వచ్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. దీంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనం ఎక్కించారు. దీంతో ఆగ్రహించిన రైతులు పోలీసు వాహనంపై రాళ్లు రువ్వి అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు రైతులను చెదరగొట్టి బండి సంజయ్‌ను కామారెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని