Karnataka Polls: బెళగావి.. కంచుకోటలో ‘కాషాయానికి’ కష్టాలు..!

లింగాయత్‌ సామాజిక వర్గానికి కంచుకోటగా ఉన్న బెళగావిలో ఈసారి రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. దీంతో అక్కడ భాజపా, కాంగ్రెస్‌ మధ్య మరోసారి హోరాహోరీ పోటీ నెలకొననున్నట్లు తెలుస్తోంది.

Published : 27 Apr 2023 18:45 IST

బెళగావి: కర్ణాటక అర్బన్‌ తర్వాత అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న జిల్లా బెళగావి. గడిచిన రెండు దశాబ్దాలుగా భాజపాకు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో ఇటీవల రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటివరకు లింగాయత్‌ వర్గం చుట్టూ తిరిగిన రాజకీయాలు. కొన్ని దశాబ్దాల క్రితం వరకు బలంగా ఉన్న మహారాష్ట్ర ఏకీకరణ్‌ సమితి (MES) గత కొన్ని ఎన్నికలనుంచి పెద్దగా ప్రభావం చూపడం లేదు. అయితే కొంతకాలంగా అక్కడ నడుస్తున్న సరిహద్దు వివాదంతో సమితి తిరిగి పుంజుకునేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు కీలక నేతల పార్టీ ఫిరాయింపులతో ఈసారి అక్కడ భాజపా, కాంగ్రెస్‌ మధ్య గట్టి పోటీ నెలకొననున్నట్లు కనిపిస్తోంది.

లింగాయత్‌లే కీలకం..

లింగాయత్‌ సామాజిక వర్గానికి కంచుకోటగా ఉన్న మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు జిల్లా బెళగావి. ఇక్కడ మొత్తం 18 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఓటర్ల సంఖ్య 39లక్షలు. క్రితం ఎన్నికల్లో ఇక్కడ భాజపా 10 స్థానాలు, కాంగ్రెస్‌ ఎనిమిది చోట్ల విజయం సాధించాయి. అయితే, ఇందులో ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి భాజపాలో చేరారు. మొత్తంగా 13 స్థానాల్లో లింగాయత్‌ ప్రాబల్యం అధికంగా ఉండగా.. మరో ఐదు చోట్ల మరాఠాల ప్రభావం కనిపిస్తుంది. గడిచిన రెండు దశాబ్దాలుగా భాజపా ఇక్కడ బలమైన పార్టీగా కొనసాగుతోంది. గడిచిన మూడు పర్యాయాలుగా (శివసేన-ఎన్సీపీ మద్దతు కలిగిన ఎంఈఎస్‌ ప్రాబల్యమున్న) ఐదు చోట్ల మినహా మిగతా స్థానాల్లో భాజపా, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది.

కీలక నేతలు దూరం..

బెళగావిలో ఇటీవల మారుతున్న రాజకీయ సమీకరణలను చూస్తే లింగాయత్‌ వర్గం నాయకత్వలేమి ఉంది. ముఖ్యంగా యడియూరప్ప పోటీచేయకపోవడం సురేష్‌ అంగాడీ, ఉమేష్‌ కత్తి వంటి నేతల మరణించడం ఓ లోటు. అదే సమయంలో ఎస్టీ వర్గానికి చెందిన జార్కిహోళి కుటుంబం కూడా బెళగావి ఓటర్లలో ప్రభావం చూపే అవకాశాలున్నాయి. వీరితోపాటు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది భాజపాను వీడి కాంగ్రెస్‌లో చేరడం కాషాయ పార్టీ కష్టాలకు కారణం కానున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ vs భాజపా..

సరిహద్దు వివాదంతో బెళగావిలో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇక్కడ కొన్ని గ్రామాల్లో సుమారు 40శాతం మంది మరాఠీ మాట్లాడే ప్రజలే ఉంటారు. ఇటువంటి ప్రాంతంలో సరిహద్దు వివాద అంశాన్ని ప్రస్తావిస్తూ మహారాష్ట్ర ఏకీకరణ్‌ సమితి ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. దీనిని మహారాష్ట్ర, కర్ణాటకలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వాలు పరిష్కరించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ సమస్య పూర్తిగా సద్దుమణగలేదు. దీంతో స్థానికంగా ఈ అంశం కీలకంగా మారనుంది. ఇలా ముక్కోణంగా మారిన ఈ పోరులో.. ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌, భాజపాల ఓట్లను ఎంఈఎస్‌ చీల్చే అవకాశం ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు ఈ జిల్లా నుంచి ఎన్నికయ్యే వారిలో ఎక్కువగా చక్కెర పరిశ్రమ అధినేతలు కావడం గమనార్హం. అది కూడా జార్కిహోలీ, జోల్స్‌, కత్తి కుటుంబాలకు చెందిన వారి ప్రాబల్యమే ఎన్నికల్లో అధికంగా ఉంటుంది. వీరిలో జార్కిహోలీ కుటుంబ నాయకులకు పార్టీలు మార్చే వారనే పేరుంది. జోల్స్‌ కుటుంబానికి చెందిన నేతలు మాత్రం భాజపా తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక కత్తి కుటుంబానికి చెందిన రమేష్‌, నిఖిల్‌ వంటి నేతలు భాజపా తరఫున రంగంలో ఉన్నారు. ఇలా గత రెండు దశాబ్దాలుగా కాషాయపార్టీకి కీలకంగా ఉన్న బెళగావిలో కాంగ్రెస్‌ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు