Kapil Moreshwar: కేంద్ర మంత్రికి సొంత పార్టీ నేతల సెగ.. అవినీతి వ్యాఖ్యలపై యూటర్న్‌!

పశ్చిమ బెంగాల్‌లో ఉపాధి హామీ పథకం అమలుపై భాజపాకు చెందిన ఓ కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలనుంచే తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన తాజాగా యూటర్న్‌ తీసుకోవడం గమనార్హం...

Published : 16 Jul 2022 02:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమ బెంగాల్‌లో ఉపాధి హామీ పథకం అమలుపై భాజపాకు చెందిన ఓ కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలనుంచే తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన తాజాగా యూటర్న్‌ తీసుకున్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలులో బెంగాల్ ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్లు తనకు తెలియదని కేంద్ర పంచాయతీరాజ్‌ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ బుధవారం వ్యాఖ్యానించారు. పంచాయతీ స్థాయిలో జరుగుతున్న అవినీతి ఆరోపణలపై మాట్లాడలేనని, అధికారులతో తనిఖీ చేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలు.. బెంగాల్‌ భాజపాలో చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర మంత్రికి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియవంటూ నేతలు విమర్శలకు దిగారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే మంత్రి కపిల్‌.. శుక్రవారం తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు. ఈ పథకానికి సంబంధించి రాష్ట్రం నుంచి కేంద్రానికి అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయని అన్నారు. ఈ పథకం కింద ఖర్చు చేసిన నిధులపై టీఎంసీ ప్రభుత్వం ఎటువంటి పత్రాలు సమర్పించలేదని చెప్పారు. ‘బెంగాల్‌లో ఉపాధిహామీ పథకం అమలులో అవినీతి జరిగింది. దీనికి సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం యుటిలైజేషన్‌ పత్రాలు సమర్పించలేదు. అవినీతి ఆరోపణలు వచ్చిన ప్రాంతాల్లో పర్యటించలేదు. వచ్చేసారి పశ్చిమ బెంగాల్‌కు వచ్చినప్పుడు అక్కడికి వెళ్తా’ అని మంత్రి వివరణ ఇచ్చారు.

అంతకుముందు భాజపా పశ్చిమ బెంగాల్‌ అధ్యక్షుడు సుకంత మజుందార్‌ మాట్లాడుతూ..‘ కపిల్‌ ఏం చెప్పారో తెలియదు. కేంద్ర మంత్రి కావడం వల్ల క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో బహుశా ఆయనకు సరిగ్గా తెలియదు’ అని అన్నారు. కేంద్ర అధికారులు సక్రమంగా తమ విధులు నిర్వర్తించని కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్లు భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు దిలిప్‌ ఘోష్‌ ఆరోపించారు. ‘కేంద్ర అధికారులు హోటళ్లలో బస చేసి.. కిందిస్థాయి అధికారులు కోరుకున్న విధంగా నివేదికలు సమర్పించారు. కాబట్టి.. మంత్రికి వాస్తవ పరిస్థితులు తెలియకపోవడం సాధారణమే’ అని చెప్పారు. కేంద్ర మంత్రి నిజాలు మాట్లాడారని.. అయితే, సొంతపార్టీ నుంచే విమర్శలు వచ్చిన నేపథ్యంలో వెనక్కి తగ్గారని టీఎంసీ నేత తపస్‌ రే పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని