Bhajanlal Sharma: ఆఖరి వరుసలో ఉన్న వ్యక్తి.. ముఖ్యమంత్రి అయ్యారు!

రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్‌ శర్మను ప్రకటించడానికి కొద్దిసేపటి ముందు తీసిన ఓ ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Updated : 12 Dec 2023 22:29 IST

దిల్లీ: ఒక నిర్ణయం మనిషిని ఎక్కడి నుంచి ఎక్కడి తీసుకెళ్తుందో చెప్పలేమనడానికి రాజస్థాన్‌ ముఖ్యమంత్రి (Rajathan Chiefminister) ఎంపికే ఓ ఉదాహరణ. వసుంధర రాజే (Vasundhara Raje), గజేంద్రసింగ్‌ షెకావత్‌ (Gajendra Singh Shekhawat), బాలక్‌నాథ్‌ లాంటి హేమాహేమీ నాయకులు ఉన్నా.. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన భజన్‌లాల్‌ శర్మను (Bhajanlal Sharma) ముఖ్యమంత్రిగా అధిష్ఠానం ఎంపిక చేయడం అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేసింది. సీఎం అవుతానని కలలో కూడా ఊహించని వ్యక్తిని ఆ పదవి వరిస్తే.. ఆయన ఆనందాన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యమే. భజన్‌లాల్‌ శర్మకు ప్రస్తుతం అలాంటి అనుభవమే ఎదురైంది.

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై అధిష్ఠానానికి ఓ స్పష్టత వచ్చాక, సీఎం పేరు ప్రకటించడానికి కొద్ది నిమిషాల ముందు తీసిన ఓ ఫొటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. సీఎం ఎంపిక కోసం అధిష్ఠానం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు ఓ గ్రూప్‌ ఫొటో దిగారు. అందులో ప్రముఖులు, సీనియర్‌ నాయకులు తొలి వరుసలో కూర్చొని ఉండగా.. ప్రస్తుత ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ చివరి వరుసలో ఓ మూలన నిల్చొని ఉన్నారు. సీఎం అభ్యర్థిపై కమిటీ సభ్యులు చర్చిస్తున్న సమయంలోనూ ఆయన ఎక్కడో వెనుక వరసలో కూర్చున్నారట. అక్కడికి నిమిషాల వ్యవధిలోనే ఆయన పేరును ముఖ్యమంత్రిగా ప్రకటించడం.. కమిటీలో సభ్యుడిగా ఉన్న రాజ్‌నాథ్‌ సహా పలువురు కీలక నేతలు అభినందించడం వరుసగా జరిగిపోయాయి. అతడు ఆ షాక్‌ నుంచి తేరుకునేందుకే కొద్ది సమయం పట్టిందట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని