‘రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా చూపేందుకేనా ఈ యాత్ర?’.. జైరాం రమేశ్‌ సమాధానమిదే..

Bharat Jodo Yatra: భారత్‌ జోడో యాత్ర రాజకీయ యాత్ర కాదని, దీనికీ ఎన్నికలకూ సంబంధమే లేదని జైరాం రమేశ్‌ అన్నారు. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా చూపేందుకే యాత్ర అన్న వాదనలను తోసిపుచ్చారు.

Published : 07 Jan 2023 18:36 IST

కర్నల్‌ (హరియాణా): వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP)ని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకమయ్యేందుకు కసరత్తు జరుగుతోంది. విపక్షాల ఐక్య వేదికకు కాంగ్రెస్‌ నేతృత్వం వహించాలని కొన్ని పార్టీలు అభిప్రాయపడుతుండగా.. అందుకు కొన్ని పార్టీలు నిరాకరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధానిమంత్రి అభ్యర్థి ఎవరనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’ చేపట్టారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. అయితే, రాబోయే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ను చూపడమే ఈ యాత్ర లక్ష్యమా? అంటూ విలేకరుల నుంచి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌కు ప్రశ్న ఎదురైంది. దీన్ని ఆయన సున్నితంగా తోసిపుచ్చారు. ఇది ఎన్నికల యాత్ర కానేకాదని చెప్పారు. హరియాణాలోని కర్నల్‌లో విలేకరులతో ముచ్చటించారు. 

‘‘రాబోయే ఎన్నికల్లో ప్రధాని మంత్రి అభ్యర్థిగా చూపడం ‘భారత్‌ జోడో యాత్ర’ లక్ష్యం కానే కాదు. వ్యక్తిగత యాత్ర అసలే కాదు. ఇది కాంగ్రెస్‌పార్టీ సైద్ధాంతిక యాత్ర. ఎన్నికలకు దీనికీ సంబంధమే లేదు’’ అని చెప్పారు. ‘‘యాత్రలో దాదాపు 200 మంది భారత యాత్రీలు ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ దీన్ని చేపట్టింది. చాలా మంది కార్యకర్తలు దీంట్లో పాల్గొంటున్నారు. అయితే, యావత్‌ దేశం దృష్టి రాహుల్‌ గాంధీపైనే ఉంది. అయినంత మాత్రన ఇది వ్యక్తిగత యాత్ర కాదు. ప్రధాని మంత్రి అభ్యర్థిగా రాహుల్‌ను చూపే ప్రయత్నం కాదు’’ అని జైరాం రమేశ్‌ అన్నారు. ఆర్థిక అసమానతలు, సమాజంలో నాటుకున్న విద్వేషం, రాజకీయ నిరంకుశత్వాన్ని ఎండగట్టడమే  ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారితో రాహుల్‌ మమేకం అవుతున్నారని జైరాం రమేశ్‌ చెప్పారు. అలాంటి యాత్రను ఎన్నికల యాత్రగా అభివర్ణించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. సెప్టెంబర్‌ 7న తమిళనాడులో ప్రారంభమైన ఈ యాత్ర జనవరి 30న కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగియనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని