Gujarat politics: గుజరాత్‌ సీఎంగా భూపేంద్ర పటేల్‌ ప్రమాణస్వీకారం

Bhupendra Patel: గుజరాత్‌ 17వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ (59) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ ఆచార్య దేవ్‌వ్రత్‌ ఆయన చేత ప్రమాణం చేయించారు.

Updated : 13 Sep 2021 16:21 IST

గాంధీనగర్‌: గుజరాత్‌ 17వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ (59) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ ఆచార్య దేవ్‌వ్రత్‌ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌, కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, మన్సుఖ్‌ మాండవీయ, ప్రహ్లాద్‌ జోషి తదితరులు హాజరయ్యారు. విజయ్‌ రూపాణీ రాజీనామా చేయడంతో భూపేంద్ర పటేల్‌ను భాజపా అధిష్ఠానం సీఎంగా నియమించిన సంగతి తెలిసిందే.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు మాజీ సీఎం విజయ్‌ రూపాణీని ఆయన నివాసంలో ఈ ఉదయం భూపేంద్ర పటేల్‌ కలిశారు. అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన అమిత్‌షాకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు అహ్మదాబాద్‌లోని స్వామి నారాయణ్‌ ఆలయంలో గో పూజ నిర్వహించారు. భూపేంద్ర పటేల్‌ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు.

మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉత్తర్‌ప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌కు నమ్మకస్థుడైన భూపేంద్ర పటేల్‌ తొలిసారి ఎమ్మెల్యే కావడం గమనార్హం. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘట్లోడియా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పటేల్‌ సామాజిక వర్గానికి చెందిన భూపేంద్రను అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు సీఎం చేయడం వెనుక భాజపా ఎన్నికల వ్యూహం దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టడంతో పాటు మెజార్టీ ఓటర్లు ఉన్న ఆ వర్గం ఓట్లను ఒడిసిపట్టడంలో భాగంగానే రూపాణీని సీఎం పదవి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని