Rajya Sabha Polls: గుజరాత్‌ నుంచి రాజ్యసభ బరిలో నడ్డా.. ఏడుగురితో భాజపా మరో జాబితా

రాజ్యసభ ఎన్నికలకు మరికొందరి పేర్లతో భాజపా మూడో జాబితాను విడుదల చేసింది.

Updated : 14 Feb 2024 17:29 IST

దిల్లీ: రాజ్యసభ ఎన్నికల (Rajya Sabha Elections) కోసం ఇప్పటికే 19 మంది అభ్యర్థులను ప్రకటించిన భాజపా.. తాజాగా ఏడుగురితో  మరో జాబితాను  విడుదల చేసింది. గుజరాత్‌ నుంచి నలుగురు, మహారాష్ట్ర నుంచి ముగ్గురిని ఎంపిక చేసింది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda)ను గుజరాత్‌ నుంచి బరిలో నిలిపింది. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన పదవీ కాలం ఏప్రిల్‌తో ముగియనుండటంతో ఆయన్ను ఈసారి గుజరాత్‌ నుంచి నామినేట్‌ చేయాలని నిర్ణయించింది. అలాగే, కాంగ్రెస్‌ను వీడి మంగళవారం భాజపాలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌ చవాన్‌కు రాజ్యసభ సీటు ఇచ్చింది.

వీరిద్దరితో పాటు రాజ్యసభ బరిలో గుజరాత్‌ నుంచి గోవింద్‌ భాయ్‌ ఢోలాకియా, మయాంక్‌ భాయ్‌ నాయక్‌, డా.జశ్వంత్‌ సిన్హ్‌ సలాంసిన్హ్‌ పర్మార్‌ ఉండగా.. మహారాష్ట్ర నుంచి మేధా కులకర్ణి, డా.అజిత్‌ గోప్చాడేలను ఎంపిక చేసింది. 15 రాష్ట్రాల నుంచి ఏప్రిల్‌లో ఖాళీ అయ్యే 56 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం జనవరిలో నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15తో నామినేషన్ల గడువు ముగియనుంది. ఫిబ్రవరి 27న పోలింగ్‌ నిర్వహించి అదేరోజు సాయంత్రం 5గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని