నాలుగున్నరేళ్ల పాలనలో ముగ్గురు సీఎంలా? 

భారతీయ జనతా పార్టీ ఉత్తరాఖండ్‌ రాష్ట్రాన్ని రాజకీయ అస్థిరత్వంలోకి నెట్టేసిందని, వరుసగా సీఎంలను మారుస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది

Updated : 03 Jul 2021 15:17 IST

భాజపాపై కాంగ్రెస్‌ ధ్వజం

దిల్లీ: భారతీయ జనతా పార్టీ ఉత్తరాఖండ్‌ రాష్ట్రాన్ని రాజకీయ అస్థిరత్వంలోకి నెట్టేసిందని, వరుసగా సీఎంలను మారుస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది. దేవభూమిని భాజపా అవమానిస్తోందని ఆరోపించింది. 

అనూహ్య రాజకీయ పరిణామాల నడుమ ఉత్తరాఖండ్‌ సీఎం తీరథ్‌ సింగ్‌ రావత్‌ శుక్రవారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నేత హరీశ్‌ రావత్‌ స్పందించారు. ‘‘డెహ్రాడూన్‌లో భాజపా హైడ్రామా.. రాష్ట్ర ప్రజలకు అవమానకరం. రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ పాలన కొనసాగిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. అయితే అభివృద్ధి జరగలేదు కానీ, వరుసగా కొత్త ముఖ్యమంత్రులు వస్తున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో ముగ్గురు సీఎంలు వచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం పక్కనబెట్టి.. భాజపా రాష్ట్రాన్ని రాజకీయ అస్థిరత్వంలోకి నెట్టేస్తోంది’’ అని హరీశ్‌ దుయ్యబట్టారు. 

‘‘కొవిడ్‌ కారణంగా ఉప ఎన్నికలు నిర్వహించడం లేదని, రాజ్యాంగ నిబంధనల దృష్ట్యా సీఎం రాజీనామా చేస్తున్నారని చెబుతున్నారు. ఇంతకంటే పెద్ద అబద్ధం ఉంటుందా? కొవిడ్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో ఉప ఎన్నికలు నిర్వహించారు. సాల్ట్‌ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగినప్పుడు సీఎం అక్కడి నుంచి పోటీ చేయాల్సింది’’ అని హరీశ్‌ రావత్‌ ట్విటర్‌లో మండిపడ్డారు. 

కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా కూడా కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్న భాజపా.. రాష్ట ప్రజలకు సేవ చేయడం మాని, అధికారాన్ని పంచుతోందని, దీనికి ప్రధాని మోదీ, జేపీ నడ్డానే కారణమని ఆరోపించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని