Mamata Banerjee: ప్రత్యామ్నాయం లేకనే అధికారంలో భాజపా..!

ప్రజలకు సరైన ప్రత్యామ్నాయం దొరికిన రోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీని అధికారం నుంచి దించుతారని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఉద్ఘాటించారు.

Published : 08 Mar 2022 17:09 IST

జాతీయస్థాయిలో మరో రాజకీయ వేదిక అవసరమన్న మమతా బెనర్జీ
టీఎంసీ సంస్థాగత సమావేశానికి హాజరైన ప్రశాంత్‌ కిశోర్‌

కోల్‌కతా: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వేళ జాతీయ స్థాయిలో కొత్త కూటమిపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి స్పందించారు. ప్రజలకు సరైన ప్రత్యామ్నాయం దొరికిన రోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీని అధికారం నుంచి దించుతారని ఉద్ఘాటించారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేనందునే కేంద్రంలో భాజపా అధికారంలో కొనసాగుతోందన్న మమతా.. ఆ ప్రత్యామ్నాయ శక్తిని ఏర్పాటు చేసేందుకు తృణమూల్‌తో సహా ఇతర విపక్ష పార్టీలు ఏకమవ్వాలని సూచించారు.

‘జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం లేనందునే భాజపా ఇంకా అధికారంలో కొనసాగుతోంది. అది దొరికిన రోజు భాజపా అధికారం నుంచి దిగిపోతుంది’ అంటూ కోల్‌కతాలో జరిగిన తృణమూల్‌ కాంగ్రెస్‌ సంస్థాగత సమావేశంలో మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇక టీఎంసీ ఛైర్‌పర్సన్‌గా ఫిబ్రవరి నెలలో తిరిగి ఎన్నికైన మమతా బెనర్జీ.. తాజాగా పార్టీ విధేయులతో నూతన రాష్ట్ర కమిటీని ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సుబత్రా బక్షీని నియమించగా, సెక్రటరీ జనరల్‌గా పార్థా ఛటర్జీని ఎంపిక చేశారు. వీరితోపాటు 20మంది ఉపాధ్యక్షులు, 19మంది జనరల్‌ సెక్రటరీలను నియమించారు. పార్టీలో అంతర్గత విభేదాలను పరిష్కరించడమే లక్ష్యంగా కొత్తగా కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే, పార్టీ, ప్రభుత్వంలో సీనియర్‌ నేతలు ఒకటి కంటే ఎక్కువ పదవులు నిర్వహిస్తుండడంపై దీదీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీకి మద్దతుగావున్న యువ నేతల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ మమతా బెనర్జీ సీనియర్లవైపే మొగ్గు చూపడం విశేషం.

హాజరైన ప్రశాంత్‌ కిశోర్‌..

మరోవైపు కోల్‌కతాలో జరిగిన ఈ కార్యక్రమంలో తృణమూల్‌ కాంగ్రెస్‌కు రాజకీయ సలహాదారుగా ఉన్న ప్రశాంత్‌ కిశోర్‌ కూడా హాజరయ్యారు. కొందరు తృణమూల్‌ నేతలకు ప్రశాంత్‌ కిశోర్‌ బృందానికి (ఐప్యాక్‌) మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు వార్తలు వస్తోన్న సమయంలో పీకే ఈ సమావేశంలో పాల్గొనడం కీలకంగా మారింది. మరోవైపు, జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక దిశగా పలు పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యక్తిగతంగా సమావేశమై చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో భాజపా వ్యతిరేక కూటమికి విపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని మమతా బెనర్జీ మరోసారి స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని