ప్రతిపక్షాలపై ప్రభుత్వ తీరు సరికాదు: భాజపా

పశ్చిమ బెంగాల్‌లో భాజపా శ్రేణులు చేపట్టిన ‘నవన్నా చలో’ ర్యాలీలో పోలీసుల తీరును భాజపా సీనియర్‌ నాయకులు ఖండించారు. పోలీసులు లాఠీలతో బెంగాల్‌లో భాజపా విస్తరణను మమత అడ్డుకోలేరని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు............

Published : 08 Oct 2020 22:32 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో భాజపా శ్రేణులు చేపట్టిన ‘నవన్నా చలో’ ర్యాలీలో పోలీసుల తీరును భాజపా సీనియర్‌ నాయకులు ఖండించారు. పోలీసులు లాఠీలతో బెంగాల్‌లో భాజపా విస్తరణను మమత అడ్డుకోలేరని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ర్యాలీలో పోలీసుల తీరును తప్పుబట్టిన రవిశంకర్‌.. ‘లాఠీఛార్జిలో దాదాపు 1500 కార్యకర్తలు గాయాల పాలయ్యారు. పోలీసులు నిరసనకారులపై ప్రయోగించిన జల ఫిరంగుల్లో ఏవో రసాయనాల్ని కలిపారు. అందుకే కొందరు కార్యకర్తలకు వాంతులు అయ్యాయి. ఇలా వ్యవహరించడం సరికాదు’ అని ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. కాగా భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ.. మమత నేతృత్వంలో రాష్ట్రం అగ్నిగుండంలా మారిందని విమర్శించారు. ప్రతిపక్షాలను అణచివేయడం సరికాదన్నారు.  

ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్‌ బంధోపాధ్యాయ స్పందిస్తూ.. ‘రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే భాజపా శ్రేణులు నవన్నా చలో ర్యాలీ చేపట్టాయి. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయోగించిన జలఫిరంగుల్లో ఎలాంటి రసాయనాలు కలపలేదు. నిరసనకారులను పోలీసులు బాగా నిలువరించారు. కోల్‌కతాలో దాదాపు 89 మందిని, హౌరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 24 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులు జరిపిన దాడిలో పలువురు పోలీసులకు సైతం గాయాలయ్యాయి’ అని వెల్లడించారు. 

పశ్చిమబెంగాల్‌లో గత కొంతకాలంగా భాజపా కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఆ పార్టీ గురువారం రాష్ట్రవ్యాప్తంగా‘నవన్నా చలో’ ఆందోళనకు పిలుపునిచ్చింది. ప్రధానంగా కోల్‌కతా, హావ్‌డాలో భారీ ర్యాలీలు చేపట్టింది. కోల్‌కతా, హౌరా నుంచి వేలాది మంది భాజపా కార్యకర్తలు సచివాలయాన్ని ముట్టడించేందుకు వచ్చారు. అయితే, సచివాలయం సమీపంలో పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి తీవ్రంగా మారడంతో పోలీసులు భాజపా కార్యకర్తలపై లాఠీఛార్జ్‌ చేశారు. బాష్పవాయువు, జలఫిరంగులను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఘర్షణల్లో భాజపా ఎంపీ జ్యోతిర్మయి సింగ్‌ మహతో, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు బెనర్జీ, పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని